Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్.. ఓ ఉగ్రవాది కాల్చివేత!

  • ఉగ్రకాల్పుల్లో పోలీస్ అధికారి వీరమరణం
  • నిఘా సమాచారంతో గాలింపు చేపట్టిన బలగాలు
  • భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం

జమ్మూకశ్మీర్ లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య రెండ్రోజులుగా కొనసాగుతున్న భీకర ఎన్ కౌంటర్ ముగిసింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని భద్రతాబలగాలు హతమార్చగా, ఓ పోలీస్ అధికారి అమరుడయ్యారు. కశ్మీర్ లోని బారాముల్లా జిల్లా గనీహమా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కారని భద్రతాబలగాలకు సమాచారం అందింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నిఘావర్గాలు ఇచ్చిన హెచ్చరిక కావడంతో పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వీరంతా నిన్న సాయంత్రం గనీహమా ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపును ప్రారంభించారు.

అయితే బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రమూకలు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు ప్రయత్నించాయి. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. నిన్న సాయంత్రం ప్రారంభమైన ఈ ఎన్ కౌంటర్ ఈరోజు ఉదయం వరకూ కొనసాగింది. చివరికి ఓ ఉగ్రవాది మృతదేహాన్ని భద్రతాబలగాలు కనుగొన్నాయి.

మరోవైపు ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ప్రత్యేక పోలీస్ అధికారి(ఎస్ పీవో) బిల్లాల్ అమరుడయ్యారు. ఎస్ఐ అమర్ దీప్ సింగ్ తీవ్రంగా గాయపడగా, ఆయన్ను భద్రతాబలగాలు ఆసుపత్రికి తరలించాయి. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ నుంచి ఉగ్రవాదులు ఎవరైనా తప్పించుకుని ఉండొచ్చన్న ఉద్దేశంతో గాలింపును కొనసాగిస్తున్నాయి.

More Telugu News