saudi women: సౌదీ మహిళలకు స్వేచ్ఛోదయం.. చదువు, ప్రయాణానికి ఇక ఎవరి అనుమతి అక్కర్లేదు!

  • ఇప్పటి వరకు తండ్రి లేదా భర్త లేదా సోదరుడి అనుమతి తప్పనిసరి
  • గార్డియన్‌షిప్‌ చట్టంలో  సవరణలు చేసిన అక్కడి ప్రభుత్వం
  • స్వేచ్ఛగా పాస్‌పోర్టు తీసుకుని విదేశాలకు వెళ్లొచ్చు

సౌదీ అరేబియాలోని మహిళలకు ఇది స్వేచ్ఛోదయం. ఎప్పటి నుంచి అమల్లో ఉన్న సంకెళ్లలాంటి ఓ చట్ట పరిమితికి అక్కడి ప్రభుత్వం చెల్లు చీటీ ఇచ్చేసింది. ఇకపై అక్కడి మహిళలు స్వేచ్ఛా విహంగాల్లా ఎగిరి పోయేందుకు ఎవరి అనుమతి అక్కర్లేదు. సొంత నిర్ణయంతో పాస్‌పోర్టు తీసుకుని విదేశాలకు వెళ్లవచ్చు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం గార్డియన్‌ షిప్‌ చట్టంలో మార్పు చేసింది.  గార్డియన్‌షిప్‌ చట్టాన్ని భరించలేక కొందరు ఉన్నత కుటుంబాలకు చెందిన మహిళలు సౌదీ నుంచి పారిపోయి విదేశాల్లో ఆశ్రయం పొందారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

వివరాల్లోకి వెళితే...మహిళ స్వేచ్ఛకు బంధనాలు వేసే దేశంలో సౌదీ అరేబియా ముందుంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ దేశంలో మహిళలపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. అక్కడి గార్డియన్‌షిప్‌ చట్టం ప్రకారం మహిళలు చదువుకోవాలన్నా, ప్రయాణం చేయాలన్న తండ్రి, భర్త లేదా సోదరుడి అనుమతి కచ్చితంగా తీసుకోవాలి.ఇకపై అటువంటి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. నిన్నటి నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది.

21 ఏళ్లు దాటిన మహిళలు కుటుంబంలోని పురుషుల అనుమతి లేకుండా పాస్‌ పోర్టు తీసుకోవచ్చు. విదేశాలకు వెళ్లొచ్చు. చదువుకోవచ్చు. మహిళల అభ్యున్నతి కోసం సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇప్పటికే మహిళలు డ్రైవింగ్‌ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. దీంతో గత ఏడాది నుంచి అక్కడి మహిళలు సొంతంగా వాహనాలు నడుపుతున్నారు.

పురుషులతో పాటు మహిళలు కూడా మైదానాలకు వచ్చి మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కల్పించారు. తాజాగా ప్రయాణ స్వేచ్చ కల్పించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంప్రదాయవాదులు కొందరు మాత్రం ఇది ఇస్లాంకు విరుద్ధమంటూ విమర్శలు చేస్తునే ఉన్నారు.

More Telugu News