Andhra Pradesh: దొంగ దొరికిపోయాక ఏమైనా చెబుతాడు.. కోడెల ‘ఫర్నీచర్’ వ్యవహారంపై అంబటి సెటైర్లు!

  • కోడెల స్థాయి బాగా తగ్గిపోయింది
  • టీడీపీ నేతలే ఆయనపై క్రిమినల్  కేసులు పెట్టారు
  • గుడిలో లింగాన్ని కూడా కోడెల మింగేశారు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నేత కోడెల శివప్రసాద్ ‘రాంబాబుతో నాకు పోటీనా? నేనెక్కడ.. రాంబాబు ఎక్కడ?’ ‘చంద్రబాబుతో జగన్ కు పోటీనా?’ అంటూ వ్యాఖ్యానించారని వైసీపీ నేత అంబటి రాంబాబు గుర్తుచేశారు. అయితే, కోడెల గురించి మాట్లాడకూడదని తాను నిర్ణయించుకున్నానని అంబటి చెప్పారు. ఎందుకంటే ఆయన స్థాయి ఇప్పుడు చాలా తగ్గిపోయిందనీ, సొంత పార్టీ నేతలే కోడెలపై క్రిమినల్ కేసులు పెట్టారని విమర్శించారు. ఈ కేసుల్లో ప్రస్తుతం విచారణ కొనసాగుతుందన్నారు. తాడేపల్లిలో ఈరోజు అంబటి మీడియాతో మాట్లాడారు.

స్పీకర్ గా ఉన్న సమయంలో ఏపీ అసెంబ్లీ సామాన్లు అమరావతికి రాకుండా నేరుగా కోడెల ఇంట్లో పడ్డాయని అంబటి ఎద్దేవా చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో కోడెల ఇప్పుడేదో కామెంట్లు చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. ‘శాసనసభ దేవాలయం లాంటిది అని కోడెల శివప్రసాద్ చెప్పారు. దీనికి ఐదేళ్లపాటు కోడెల పూజారిగా వ్యవహరించారట. నిజమే.. ఆయన ఎంతమంచి పూజారో మీరంతా చూశారు. ఆయన ఒక్కరే కాదు.. ఆయనకు ఇద్దరు అసిస్టెంట్ పూజారులు ఉన్నారు. ఒకరు పూజారిణి అయిన కూతురు, ఇంకొకరు పూజారి కొడుకు.

అరెరెరె... దేవాలయంలో కొబ్బరి చిప్పలు కూడా ఎత్తుకుపోయారు కదయ్యా. చివరికి దీపాల వొత్తులకు పోసే నూనెను కూడా అమ్ముకున్నారే? చివరికి హుండీలోని డబ్బులు కూడా ఎత్తేశారు. అంతేకాదు.. గుడిలో లింగాన్ని మింగేసిన మీరా పూజారి?’ అని దుయ్యబట్టారు. ఈ పూజారి(కోడెల) కనిపిస్తున్నా, మిగిలిన ఇద్దరూ అసిస్టెంట్ పూజారులు కనిపించడం లేదనీ, వారు విదేశాలకు వెళ్లిపోయి ఉంటారని వ్యాఖ్యానించారు.

ఇంతకుముందు ఈ ఇద్దరు అసిస్టెంట్లు గుంటూరు-నరసరావుపేట-సత్తెనపల్లి మధ్య వసూళ్లు, కొబ్బరి చిప్పల కోసం తెగ చక్కర్లు కొట్టేవారని అంబటి తెలిపారు. ఇంత దోపిడీకి పాల్పడిన స్పీకర్ ను ఏపీ ప్రజలు ఇప్పటివరకూ చూడలేదనీ, ఇకపై చూడబోరని స్పష్టం చేశారు. దొరికిన తర్వాత దొంగ ఏమైనా చెబుతాడని ఎద్దేవా చేశారు. కోడెలను తుక్కుతుక్కుగా ఓడించిన సత్తెనపల్లి ప్రజలు.. ఘోరంగా అవమానించారని చెప్పారు.

More Telugu News