chidambaram: సుప్రీంలోనూ చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌ అంశంపై ఉత్తర్వులు ఇవ్వలేమన్న కోర్టు

  • హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఎపెక్స్‌ కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
  • ప్రధాన న్యాయమూర్తికి పంపుతానన్న న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ
  • ఇక ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం 

అరెస్టు భయంతో అజ్ఞాతంలో ఉన్నట్టు భావిస్తున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు చిదంబరానికి ముందస్తు బెయిల్‌ విషయంలో సుప్రీం కోర్టులోనూ ఊరట లభించ లేదు.  ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణి కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీం కోర్టు తలుపు తట్టారు.

చిదంబరం తరపున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, వివేక్‌ టంకా ఈరోజు ఉదయం ప్రత్యేక లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా ఈ పిటిషన్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముందుకు వచ్చింది. దీనిపై తాను ఉత్తర్వులు ఇవ్వలేనని స్పష్టం చేసిన జస్టిస్ రమణ తక్షణ విచారణ కోసం ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయి ముందుకు పంపిస్తున్నట్లు తెలిపారు.

అయితే ఆయన పిటిషన్‌పై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం సుముఖత చూప లేదు. దీంతో చిదంబరానికి అరెస్టు ముప్పు నుంచి ఎలాంటి ఊరట లభించలేదు. మరోవైపు ఈరోజు తెల్లవారు జామున సీబీఐ అధికారులు చిదంబరం నివాసానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. తాజా పరిణామాలతో ఆయన ఏ క్షణమైనా అరెస్టయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

More Telugu News