Tamil Nadu: సహకార బ్యాంకు ఓటరు జాబితాలో దివంగత కరుణానిధి పేరు!

  • తిరువాయూర్‌ ఉత్తర వీధిలో ఉన్న బ్యాంకులో కరుణ సభ్యుడు
  • బ్యాంకుకు నిన్న జరిగిన ఎన్నికలు
  • లిస్టులో ఆయన పేరు చూసి షాక్‌ అయిన సభ్యులు

సార్వత్రిక ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లు కూడా అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. కోట్ల మందితో వుండే జాబితాలో అక్కడక్కడా ఇటువంటి పొరపాట్లు జరుగుతుంటాయి. అతితే, కేవలం వేల మందికి పరిమితమయ్యే సహకార బ్యాంకు జాబితాలో, అదీ తమిళనాడు రాష్ట్రంలోనే అత్యంత జనాదరణ కలిగిన ప్రముఖ వ్యక్తి పేరు చనిపోయిన తర్వాత ఉందంటే ఆశ్చర్యమే కదా. నిన్న చెన్నైలో 109 ఏళ్ల చరిత్ర కలిగిన తిరువారూర్‌ సహకార బ్యాంకు ఎన్నిక సందర్భంగా ఓటరు జాబితాలో డీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి పేరు దర్శనమివ్వడంతో సభ్యులంతా షాక్‌కు గురయ్యారు.

కరుణానిధి గత ఏడాది ఆగస్టులో చనిపోయారు. అంటే ఏడాదికాలం దాటింది. తిరువారూర్‌ ఉత్తర వీధిలో ఉన్న బ్యాంక్ లో కరుణానిధి సీనియర్‌ సభ్యుడిగా ఉండేవారు. ఆయన చనిపోవడంతో నిబంధనల మేరకు ఆయన పేరు తొలగించాలి. ఈ బ్యాంక్‌ నిర్వాహక సభ్యుల ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఓటరు జాబితాలో దక్షిణ వీధి ముత్తువేలు కుమారుడు కరుణానిధి అన్న పేరు స్పష్టంగా ఉండడం చూసి అంతా అవాక్కయ్యాారు.

అలాగే కరుణానిధి మిత్రుడు దివంగత తెన్నన్‌ పేరు కూడా జాబితాలో ఉండడంతో సభ్యులు మండిపడ్డారు. మరణించిన మాజీ సభ్యుల పేర్లను తొలగించి, కొత్త ఓటరు జాబితాను తయారు చేయాలని, మళ్లీ ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ ఎన్నికల్లో 14,817 మంది ఓటేశారు. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ కరుణానిధి బ్యాంక్‌ ఖాతాను స్తంభింపజేయని కారణంగా జాబితాలో ఆయన పేరు ఉండిపోయిందని తెలిపారు.

More Telugu News