Pakistan: పాకిస్థాన్ ను ఎక్కడైనా సరే ఎదుర్కొంటాం: ఐరాస భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్

  • కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ కోర్టులో సవాల్ చేస్తామన్న పాకిస్థాన్
  • అంతర్జాతీయ కోర్టులో పాక్ ఇప్పటికే ఒకసారి భంగపడిందన్న అక్బరుద్దీన్
  • అంతర్జాతీయ సమాజం భారత్ కు మద్దతు పలుకుతోందని వ్యాఖ్య

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని అంతర్జాతీయ కోర్టులో సవాల్ చేస్తామని పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఐక్య రాజ్య సమితి (ఐరాస)లో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పందించారు. పాకిస్థాన్ ను ఎక్కడైనా సరే, ఏ వేదిక మీద అయినా సరే ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు.

'తమకు అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకునే హక్కు ప్రతి దేశానికి ఉంటుంది. ఇండియాకు కూడా వివిధ రకాల మార్గాలు ఉన్నాయి. వివిధ వేదికలపై కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ లేవనెత్తాలని చూస్తే... అవే వేదికలపై ఆ దేశాన్ని ఎదుర్కొంటాం. అంతర్జాతీయ కోర్టులో ఇప్పటికే పాకిస్థాన్ ఒకసారి భంగపడింది' అని సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు. నేవల్ అధికారి కుల్ భూషణ్ జాధవ్ మరణశిక్షకు సంబంధించి అంతర్జాతీయ కోర్టులో పాక్ కు పరాభవం ఎదురైందనే విషయాన్ని అక్బరుద్దీన్ ఈ సందర్భంగా ఉటంకించారు.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తన మిత్ర దేశం చైనా సహకారంతో కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ లేవనెత్తిన సంగతి తెలిసిందే. అయితే, ఎలాంటి తుది ప్రకటన వెలువడకుండానే ఈ రహస్య సమావేశం ముగియడం... పాకిస్థాన్ ను షాక్ కు గురిచేసింది. దీనిపై అక్బరుద్దీన్ మాట్లాడుతూ, కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ సమాజం మద్దతును కూడగట్టుకోవడంలో పాక్ విఫలమైందని చెప్పారు. భారత్ కు అంతర్జాతీయ సమాజం మద్దతు పలుకుతోందనే విషయం... భద్రతామండలి సమావేశంతో అందరికీ అర్థమైందని తెలిపారు.

More Telugu News