Donald Trump: ట్రంప్ నోట మళ్లీ అదే మాట.. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా అధ్యక్షుడు

  • కశ్మీర్ ప్రాంతం చాలా సంక్లిష్టమైనది
  • నేను మధ్యవర్తిత్వం వహిస్తే.. వీలైనంతగా సమస్యను పరిష్కరిస్తా
  • భారత్-పాక్ ల మధ్య ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఉన్నాయి

కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన మాట మార్చి... కశ్మీర్ అంశం భారత్-పాక్ ల సమస్య అని, ఆ రెండు దేశాలే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. తాజాగా ఆయన మళ్లీ మొదటికి వచ్చారు. కశ్మీర్ అంశం చాలా తీవ్రమైనదని ఆయన వ్యాఖ్యానించారు.

'కశ్మీర్ ప్రాంతం చాలా సంక్లిష్టమైనది. మీకు హిందువులు ఉన్నారు. ముస్లింలు ఉన్నారు. అయితే రెండు వర్గాలు సంయమనంతో ఉన్నాయని నేను చెప్పలేను. రెండు దేశాలు చాలా కాలంగా కలసికట్టుగా ముందుకు సాగడం లేదనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. నేను మధ్యవర్తిత్వం వహిస్తే... వీలైనంతగా సమస్యను పరిష్కరిస్తా.' అని ట్రంప్ అన్నారు.

పరిస్థితిని తాము మెరుగుపరచగలమని తాను భావిస్తున్నానని ట్రంప్ చెప్పారు. అయితే, ఇరు దేశాల మధ్య ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఉన్నాయని... ఇది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ఇరు దేశాల్లో మతం అనేది చాలా క్లిష్టమైన సమస్య అని చెప్పారు. మతం విషయంలో చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు.

More Telugu News