Andhra Pradesh: కోడెల నరసరావుపేట ప్రజల పరువు తీసేశారు: వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి

  • అసెంబ్లీ ఫర్నిచర్ ప్రజల ఆస్తి..కోడెల ఎలా తీసుకెళ్లారు?
  • సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఇది!
  • ఎమ్మెల్యేలకు ఇచ్చే మందులు కూడా అమ్ముకున్నారు

గతంలో ఏపీ స్పీకర్ గా పని చేసిన కోడెల శివప్రసాద్ రావు అసెంబ్లీ ఫర్నిచర్ ను తన ఇంటికి తీసుకెళ్లారన్న వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, అసెంబ్లీ ఫర్నిచర్ ప్రజల ఆస్తి అని, దీన్ని కోడెల ఎలా తీసుకెళ్లారని ప్రశ్నించారు. కోడెల, నరసరావుపేట ప్రజల పరువు తీసేశారని, సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని విమర్శించారు.

కోడెల తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు లేఖ రాసినట్టుగా బుకాయిస్తున్నారని, తప్పు తేదీలతో హడావుడిగా ఈ లేఖ రాశారని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నీచమైన పనులు చేశారని, అవసరమైతే, తాము చందాలు వేసుకుని ఫర్నిచర్ ను కొనిస్తామని అన్నారు. చివరకు, ఎమ్మెల్యేలకు ఇచ్చే మందులు కూడా అమ్ముకున్నారని, అన్న క్యాంటీన్లలో భోజనాలను కోడెల తన ఫార్మా కంపెనీలో ఉద్యోగులకు అమ్ముకున్నారని ఆరోపించారు.

విచారణలో ఈ విషయాలన్నీ బయటకొస్తాయని అన్నారు. అవినీతికి పాల్పడ్డ కోడెలపై చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ? అని ప్రశ్నించిన శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపుపై చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.

More Telugu News