Andhra Pradesh: రివర్స్ టెండరింగ్ పై ‘నవయుగ’ పిటిషన్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు

  • తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం
  • ఎలాంటి కారణం చూపించకుండా ఒప్పందం రద్దు చేశారు: నవయుగ
  • రివర్స్ టెండరింగ్ కొనసాగించేందుకు మాకు అవకాశం కల్పించాలి: ప్రభుత్వ తరఫు న్యాయవాది

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం కుదిర్చిన టెండర్లను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ ను సవాల్ చేస్తూ నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ‘నవయుగ’ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి స్థలం చూపించే బాధ్యత జెన్ కోదే అని, ఎటువంటి నిబంధనలను తాము ఉల్లంఘించలేదని, ఎలాంటి కారణం చూపించకుండా తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏకపక్షంగా ఎలా రద్దు చేస్తారని నవయుగ కంపెనీ తరఫు న్యాయవాది జి.సుబ్బారావు ప్రశ్నించారు. కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తమకు ఇంకా గడువు ఉందని, తమనే కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది తమ వాదన వినిపించారు. పనుల్లో పురోగతి లేదని, నిజానికి నవయుగ కంపెనీ ఆర్బిట్రేషన్ కు వెళ్లాలే తప్ప హైకోర్టును ఆశ్రయించడం సరికాదని అన్నారు. రివర్స్ టెండరింగ్ కొనసాగించేందుకు తమకు అవకాశం కల్పించాలని కోరారు.

More Telugu News