Madhya Pradesh: బ్యాంకు మోసం కేసులో మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ మేనల్లుడి అరెస్ట్!

  • గతంలో మోసర్ బేర్ ను స్థాపించిన కమల్ నాథ్ బంధుగణం
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 354 కోట్ల రుణం
  • రతుపల్ పురి తండ్రి, తల్లి, డైరెక్టర్లపై కేసు నమోదు 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ. 354 కోట్లకు మోసం చేసిన కేసులో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పురిని ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. నిన్న రాత్రి మనీ లాండరింగ్ చట్టం కింద ఆయన్ను అరెస్ట్ చేశామని, నేడు కోర్టు ముందు హాజరుపరచనున్నామని అధికారులు వెల్లడించారు.

కాగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు మోసర్ బేర్ కు గతంలో ఈడీగా ఉన్న సమయంలో రతుల్ పురిపై ఈ కేసు నమోదైంది. ఆ సంస్థలో పనిచేసిన డైరెక్టర్ల ఇళ్లపైనా, కార్యాలయాలపైనా ఆదివారం నాడు దాడులు జరిపిన ఈడీ, నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, తదితర ఆరోపణల కింద రతుల్ పురి, ఆయన తండ్రి, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ పురి, ఇతర డైరెక్టర్లుగా ఉన్న రతుల్ తల్లి, కమల్ నాథ్ సోదరి నీతాపురిలతో పాటు సంజయ్ జైన్, వినీత్ శర్మలపై కేసులు రిజిస్టర్ చేసింది.

 2012లోనే రతుల్ మోసర్ బేర్ లో తన ఈడీ పదవికి రాజీనామా చేయగా, ఆయన తల్లిదండ్రులు మాత్రం విధుల్లో కొనసాగుతూ వచ్చారు. ఈ విషయాన్ని తన ఫిర్యాదులో తెలిపిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంపాక్ట్ డిస్క్‌ లతో పాటు డీవీడీలు, స్టోరేజ్ డివైజ్‌ లు తయారు చేసిన మోసర్ బేర్, 2009 నుంచి రుణాలు తీసుకుందని, వాటిని తిరిగి చెల్లించలేదని ఆరోపించింది. ఫోరెన్సిక్ ఆడిట్ జరిపినప్పుడు వారి ఖాతాలను 'ఫ్రాడ్ అకౌంట్‌'గా నిర్ధారించి, ఆపై ఫిర్యాదు చేశామని ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం రూ. 354.51 కోట్ల మేరకు తమకు నష్టం వాటిల్లిందని బ్యాంకు అధికారులు తెలిపారు.

More Telugu News