Jagan: వైఎస్ కనుమూసిన రోజున, అదే ప్రాంతం నుంచి... 'రచ్చబండ'ను ప్రారంభించాలని జగన్ కీలక నిర్ణయం!

  • నాడు రచ్చబండకు వెళుతూ అసువులు బాసిన వైఎస్
  • సెప్టెంబర్ 2 నుంచి చిత్తూరు జిల్లాలో జగన్ రచ్చబండ
  • క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యం

నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి, చిత్తూరు జిల్లాలో తాను అనుకున్న 'రచ్చబండ' కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని బయలుదేరి, నల్లమల అడవుల్లో ఘోర ప్రమాదానికి గురై అసువులు బాసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ కార్యక్రమాన్ని మరే ముఖ్యమంత్రీ ప్రారంభించలేదు. ఇప్పుడు తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఉన్న వైఎస్ జగన్, రచ్చబండ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలన్న సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన సెప్టెంబర్ 2 నుంచి చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జగన్ అమెరికాలో ఉండగా, ఆయన తిరిగి రాగానే పర్యటన షెడ్యూల్ ఖరారవుతుందని సమాచారం. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా తొలిసారి జగన్ ప్రజల్లోకి వెళ్లినట్టు అవుతుంది. తన పాదయాత్రలో భాగంగా కోట్లాదిమందిని దగ్గర నుంచి చూసిన జగన్, వారి సమస్యలను మరింత లోతుగా చర్చించేందుకు రచ్చబండను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు పార్టీ నేతలు అంటున్నారు.

ప్రభుత్వ పథకాల అమలుతీరు, గ్రామ వాలంటీర్ల విధానం, ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్ర స్థాయిలో అభిప్రాయాలను జగన్ తీసుకోనున్నారు. ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో కొనసాగుతుందని సమాచారం.

More Telugu News