యడియూరప్ప నిజాలు చెప్పడం లేదు.. నేను అలా అనలేదు: సిద్ధరామయ్య

19-08-2019 Mon 16:01
  • ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని నేను చెప్పలేదు
  • పారదర్శకమైన విచారణ జరగాలని మాత్రమే చెప్పాను
  • 'ఆపరేషన్ లోటస్'ను సీబీఐకి అప్పగించాలని అన్నాను
కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై బీజేపీ 'ఆపరేషన్ లోటస్' చేపట్టిందని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించడంపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా సిద్ధరామయ్య సమాధానమిస్తూ, 'యడియూరప్ప నిజాలు చెప్పడం లేదు. నేను కోరడం వల్లే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించానని ఆయన చెప్పారు. అది నిజం కాదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పారదర్శకమైన విచారణ జరగాలని మాత్రమే నేను చెప్పాను. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా శిక్షించాలని అన్నాను. ఆపరేషన్ లోటస్ పై సీబీఐ చేత విచారణ జరిపించాలని నేను సూచించాను' అని అన్నారు.

గత ముఖ్యమంత్రి (కుమారస్వామి) హయాంలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించనున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప నిన్న ప్రకటించారు. సీఎల్పీ నేత (సిద్ధరామయ్య) సహా పలువురు నేతలు ఈ మేరకు డిమాండ్ చేస్తుండటంతో... ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు  

కుమారస్వామి ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందంటూ గతంలో రెబెల్ జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అప్పట్లో ఒక కేసు నమోదైంది.