India: 1968లో మాయమైన భారత యుద్ధవిమానం శకలాలు లభ్యం!

  • 1968లో విమాన ప్రమాదం
  • 98 మందితో ప్రయాణిస్తూ అదృశ్యం
  • తాజాగా బయటపడిన పలు ప్రధాన విడిభాగాలు

51 సంవత్సరాల క్రితం హిమాచల్ ప్రదేశ్ లో అదృశ్యమైన భారత వాయుసేన విమానం శకలాలు తాజాగా లభ్యమయ్యాయి. భారత వాయుసేన చరిత్రలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదాల్లో ఒకటిగా ఈ విమానం అదృశ్యాన్ని అభివర్ణిస్తారు. 1968, ఫిబ్రవరి 7న 98 మంది రక్షణ శాఖ సిబ్బందితో లాహుల్ - స్పితి జిల్లాలో ఉన్న ఢాకా గ్లేసియర్ లో ఏఎన్-12, బీఎస్-534 విమానం అదృశ్యమైంది.

ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, లేహ్ ఎయిర్ పోర్టుకు చేరలేకపోయిన విమానం, వెనక్కు తిరిగి చండీగఢ్ కు వెళుతూ, రోహ్తంగ్ పాస్ వద్ద అదృశ్యమైంది. విమానం కోసం ఎన్నో రోజుల పాటు విస్తృతంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఆపై 2003లో హిమాలయన్ మౌంటనేరింగ్‌ ఇనిస్టిట్యూట్ సభ్యులు, విమానంలో ప్రయాణించి, ప్రాణాలు కోల్పోయిన జవాను బేలీరామ్ మృతదేహాన్ని ఓ ప్రాంతంలో గుర్తించారు.

 దీంతో తిరిగి విమానం కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. మరికొన్ని మృతదేహాలు అదే ప్రాంతంలో కనిపించాయి. ఆపై 2009లో గాలింపును పూర్తిగా నిలిపివేశారు. ఇటీవల ఢాకా గ్లేసియర్ లో కొన్ని శకలాలు కనిపించడంతో, మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగా, నిన్న పలు ప్రధాన భాగాలు లభ్యమయ్యాయి. ఇంజిన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఆయిల్ ట్యాంక్, కాక్ పిట్ డోర్ వంటివి కనిపించాయి.

More Telugu News