West Bengal: ఆకలి, అనారోగ్యం... ఓ కుటుంబాన్ని బతికుండగానే చంపేశాయి!

  • పశ్చిమ బెంగాల్ లో కారుణ్య మరణానికి దరఖాస్తు చేసుకున్న కుటుంబం
  • స్పందించిన జిల్లా కలెక్టర్
  • ఆర్థిక సాయం అందించే విషయం పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్

పశ్చిమ బెంగాల్ లో ఓ కుటుంబం ఆకలి బాధకు తట్టుకోలేక, అనారోగ్యాన్ని ఎదిరించలేక కారుణ్య మరణానికి దరఖాస్తు చేసుకున్న సంఘటన హృదయం ద్రవింపజేస్తోంది. బర్సాత్ లో నివసించే గార్గీ బందోపాధ్యాయ్ అనే మహిళ ఓ పీహెచ్ డీ స్కాలర్. భర్త నుంచి విడిపోయి వృద్ధులైన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. గార్గీ ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఓవైపు తల్లిదండ్రుల ఆకలి తీర్చలేక, అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఇద్దరికి మందులు కొనలేక కుమిలిపోతోంది.

చివరికి ఓ రోజు తన తండ్రి ఓ చిన్న పిల్లవాడి వద్ద రూ.10 అడుక్కోవడం చూసి నిలువునా కుంగిపోయింది. ఈ నేపథ్యంలో, ఇక తాము బతకలేమని, చనిపోవడానికి అనుమతి ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ కు విజ్ఞాపన పత్రం అందజేసింది. ఈ విషయాన్ని కలెక్టర్ మున్సిపల్ చైర్మన్ సునీల్ ముఖర్జీకి పంపగా ఆయన వెంటనే స్పందించారు.

తాము గార్గీకి ఆర్థిక సాయం అందించలేమని, ఆమె తల్లిదండ్రులకు మాత్రం ఆర్థికసాయం అందించే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు ఎంతో ఉన్నతస్థితిలో బతికిన గార్గీ కుటుంబం చివరికి ఎంతో దయనీయ స్థితిలో ఇతరులపై ఆధారపడాల్సి రావడం విచారకరం అని చెప్పాలి.

More Telugu News