Telangana: దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాలి: సీఎం కేసీఆర్

  • జెన్ కో ట్రాన్స్ కో, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీలను సన్మానించిన కేసీఆర్
  • విద్యుత్ రంగాన్ని తీర్చి దిద్దేందుకు సమగ్ర వ్యూహం అనుసరించాం
  • ఆరు నెలల్లో విద్యుత్ కోతలు ఎత్తి వేశాం

దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను జెన్ కో ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ రాజీవ్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు అధికారులను కేసీఆర్ సన్మానించారు. దేశంలో, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, దేశంలో ఇంకా విద్యుత్ కోతలు అమలవుతున్నాయని, ఈ పరిస్థితి మారాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉందని, రాష్ట్ర ప్రగతికి ఆనాడు విద్యుత్ సమస్యే తీవ్ర అవరోధంగా నిలిచిందని అన్నారు.

విద్యుత్ సమస్యను పరిష్కరించనిదే రాష్ట్ర పురోగతి సాధ్యం కాదని భావించామని, విద్యుత్ రంగాన్ని తీర్చి దిద్దడానికి సమగ్ర వ్యూహం అనుసరించామని, కేవలం, ఆరు నెలల్లో విద్యుత్ కోతలు ఎత్తి వేశామని అన్నారు. ఇప్పుడు అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. అన్ని రంగాలకూ అన్నివేళల్లో నాణ్యమైన విద్యుత్ సరఫర లక్ష్యంగా పనిచేయాలని, స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం కూడా ఉపయోగించుకోవడం లేదని అన్నారు. తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి పీఎఫ్సీ అందించిన సహకారం దోహదపడిందని, తెలంగాణ మిగుల్ విద్యుత్ రాష్ట్రంగా ఎదిగేందుకు పీఎఫ్సీ సహకరించిందని ప్రశంసించారు. నీటి పారుదల ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించినందుకు పీఎఫ్సీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

More Telugu News