go air plane: నావిగేషన్‌ చార్ట్‌ మిస్సింగ్‌...గో ఎయిర్‌ ఏ320 విమానం యూ టర్న్‌

  • ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరిన విమానం
  • గాల్లోకి లేచిన కొద్దిసేపటికే వెనక్కి మళ్లించిన పైలట్‌
  • ఆందోళనకు గురైన ప్రయాణికులు

రోడ్డు మార్గంలో ప్రయాణించే వారికి యూ టర్న్‌ పదం సర్వసాధారణం. విమాన మార్గంలో ఈ మాట వినడం అరుదే. కానీ ఢిల్లీ  ఎయిర్‌ పోర్టు నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరిన ఓ విమానం యూ టర్న్‌ తీసుకుని తిరిగి ఢిల్లీకే చేరింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే  విమానానికి దారిచూసే నావిగేషన్‌ చార్ట్‌లు లేకపోవడంతో పైలట్‌ విమానాన్ని తిరిగి వెనక్కి తీసుకువచ్చాడు. వివరాల్లోకి వెళితే...ఢిల్లీ  నుంచి బ్యాంకాక్‌కు  146 మంది ప్రయాణికులతో వెళ్లాల్సిన ఓ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వైమానిక అధికారులు హుటాహుటిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. గో ఎయిర్‌ ఏ320 విమానాన్ని ఏర్పాటు చేశారు.

ప్రత్యామ్నాయ విమానాన్ని ప్రయాణికులు చకాచకా ఎక్కేశారు. విమానం గాల్లోకి ఎగిరాక గో ఎయిర్‌ విమానం కెప్టెన్‌ నావిగేషన్‌ చార్ట్ లు కనిపించక పోవడాన్ని గమనించాడు. అవి లేకుండా విమానాన్ని గమ్యస్థానం చేర్చడం కష్టం కావడంతో వెంటనే యూ టర్న్‌ తీసుకున్నాడు. దీన్ని గమనించిన ప్రయాణికుల్లో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది.

ఢిల్లీ  ఎయిర్‌ పోర్టులో విమానం దిగాక ఆరాతీస్తే నేవిగేషన్‌ చార్ట్‌ను కొత్త విమానంలో అప్‌డేట్‌ చేయలేదని తేలింది. రూట్‌ తెలియకుండా ప్రయాణించడం ప్రమాదమని భావించిన కెప్టెన్‌ యూ టర్న్‌ తీసుకోక తప్పలేదు.

More Telugu News