Australia: జోఫ్రా ఆర్చర్ వేసిన రాక్షస బంతి... మైదానంలోనే కుప్పకూలిన స్టీవ్ స్మిత్!

  • 148 కి.మీ. వేగంతో దూసుకొచ్చిన బంతి
  • రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన స్టీవ్ స్మిత్
  • జోఫ్రా ఆర్చర్ నవ్వడంపై విమర్శలు

ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, 148 కిలోమీటర్ల వేగంతో విసిరిన బౌన్సర్, తలకు నేరుగా తగలడంతో ఆస్ట్రేలియా కీలక క్రికెటర్ స్టీవ్ స్మిత్ మైదానంలో కుప్పకూలి, విలవిల్లాడాడు. ఈ ఘటన ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్‌ సిరీస్, రెండో టెస్టులో జరిగింది. స్టీవ్ స్మిత్ 80 పరుగులతో ధాటిగా ఆడుతున్న వేళ, ఆర్చర్ వేసిన బంతి, అతన్ని గాయపరచగా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ వైద్య బృందాలు అతడికి చికిత్సను అందించి, వెంటనే మైదానం నుంచి వెళ్లాలని సూచించడంతో అతను రిటైర్డ్‌ హర్ట్‌ గా పెవీలియన్ చేరాడు.

అతనికి పెద్దగా ప్రమాదం లేదని వైద్యులు తేల్చడంతో, సిడిల్ అవుట్ అయిన తరువాత తిరిగి బ్యాటింగ్ కు వచ్చినా, స్మిత్, మరో 12 పరుగులు మాత్రమే చేసి, సెంచరీని సాధించలేక అవుట్ అయ్యాడు. వోక్స్ బౌలింగ్‌ లో స్మిత్ అవుట్ అయ్యాడు.

కాగా, గాయపడిన తరువాత ఆర్చర్ నవ్వుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తోటి ప్లేయర్ ను గాయపరచడంతో పాటు అలా ఎలా నవ్వుతున్నావని పలువురు ఆర్చర్ ను విమర్శిస్తున్నారు. మొన్నటి ప్రపంచకప్‌ లో ఆర్చర్ బౌలింగ్‌లోనే ఆసీస్‌ ఆటగాడు అలెక్స్ కారీకి దవడ పగిలిందన్న సంగతి తెలిసిందే.

More Telugu News