Jagan: ఎవరు సేవ చేస్తే, వారి పేరు శాశ్వతంగా నిలిచేలా చర్యలు: ప్రవాసాంధ్రులకు జగన్ బంపరాఫర్!

  • జన్మభూమికి సేవ చేసేందుకు రండి
  • బస్టాండైనా, ఆసుపత్రైనా, స్కూలైనా మీ పేరే
  • ప్రవాసాంధ్రులు పెట్టుబడులతో రావాలన్న జగన్

కన్నతల్లి కన్నా గొప్పదైన జన్మభూమికి సేవ చేసుకునే వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. డల్లాస్ లో ప్రవాసాంధ్రులతో సమావేశమై, వారిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, రాష్ట్రానికి పెట్టుబడులతో తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారి పేరును శాశ్వతంగా నిలిచిపోయేలా చేస్తానని అన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న ప్రవాసాంధ్రులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం పోర్టల్ కు నేరుగా అనుసంధానమై, అనుమతులను పొందవచ్చని అన్నారు. మీ గ్రామానికే వచ్చి, అక్కడే ఇన్వెస్ట్ మెంట్ చేయవచ్చని, బస్టాండ్, పాఠశాల, ఆసుపత్రి దేనికి సాయం చేయాలనుకున్న పోర్టల్ లో చెప్పవచ్చని అన్నారు. మీరు చేసే సహాయానికి, సేవకు మీ పేరునే పెడతామని, తద్వారా వారి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసే అవకాశం ఉన్నా, ఆ పని చేయలేదని, అసలు 13 నెలలుగా డిస్కమ్‌ లకు బిల్లులు చెల్లించలేదని, ఇప్పటికే ఆ బకాయి రూ. 20 వేల కోట్లకు పైగా పెరిగిపోయిందని చెప్పారు. పల్లెలు, పట్టణాల మధ్య అంతరాలను చెరిపేసే చర్యలు చేపట్టామని, ప్రవాసాంధ్రులు ఏడాదికి కనీసం ఒకసారైనా రాష్ట్రానికి వచ్చి, జరుగుతున్న అభివృద్ధిని చూసి, స్వయంగా అడిగి తెలుసుకోవాలని జగన్ కోరారు. ప్రభుత్వ వెబ్‌ సైట్‌ లో ఉండే పోర్టల్ పర్యవేక్షణకు ఒక అధికారిని ప్రత్యేకంగా నియమిస్తానని చెప్పారు.

More Telugu News