Jagan: డల్లాస్ లో తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వైఎస్ జగన్!

  • వైకాపా విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర
  • పెట్టుబడులు పెట్టేవారికి అన్ని సౌకర్యాలూ
  • ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి రావాలన్న జగన్

వారం రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం, ఆగస్టు 17 సాయంత్రం 6 గంటలు) తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. డల్లాస్ లోని హచిన్ సన్ కన్వెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమం జరిగింది. జగన్ తో సమావేశమయ్యేందుకు పెద్దఎత్తున ప్రవాసాంధ్రులు తరలివచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన అనంతరం జగన్ ప్రసంగించారు.

వైకాపా ఘన విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతైనా ఉందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ప్రవాసాంధ్రులు తమపై చూపుతున్న ప్రేమకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. అమెరికా అభివృద్ధిలో భారతీయుల కృషి ఎంతో ఉందని స్వయంగా అమెరికా అధ్యక్షుడే ఒప్పుకున్నాడని గుర్తు చేస్తూ, ఆయన ప్రత్యేకంగా తెలుగువారిని పొగిడారని, ఇది తనకెంతో గర్వంగా అనిపించిందని అన్నారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగాన్ని చదివి వినిపించిన జగన్, 'ఐ హ్యావ్ ఏ డ్రీమ్' అన్న ఆయన మాటలు తనకు స్ఫూర్తని, అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రాన్ని చూడాలన్నది తన కలని వ్యాఖ్యానించారు. అన్నం పెట్టే రైతు ఆకలి బాధతో మరణించకూడదని తాను కలగంటున్నానని, ప్రభుత్వ పథకాలు లంచం, అవినీతి లేకుండా పేదలకు అందాలని కలగంటున్నానని, రాష్ట్రంలోని ప్రతి ఎకరానికీ సాగునీటిని అందించాలన్నది తన కలని చెప్పారు.

 పాలకులు మనసు పెడితే చేయలేనిది ఏదీ లేదన్న విషయాన్ని తాను నమ్ముతానని, అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలల పరిపాలనలోనే చరిత్రను మార్చే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని, పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ విద్యార్థులకు వరమని వైఎస్ జగన్ చెప్పారు.

రానున్న గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయనున్నామని గుర్తు చేశారు. మహిళలకు రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ఏ పరిశ్రమ వచ్చినా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేశామని చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా టెండర్ల విషయంలో న్యాయ సమీక్ష చేపట్టాలన్న ఉద్దేశంతో ముందుకెళుతున్నట్టు తెలిపారు.

మంత్రివర్గంలో 60 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు ఇచ్చామని, కీలకమంత్రిత్వ శాఖలను బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చామని అన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంతో సఖ్యతగా ఉన్నామని, వృథాగా సముద్రంలోకి వెళుతున్న గోదావరి నదీ జలాలను రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాలకు తీసుకుని వస్తామని జగన్ తెలిపారు.

More Telugu News