India: భద్రతామండలిలో కశ్మీర్ అంశం చర్చకు రావడమే గొప్పవిజయంగా ప్రచారం చేసుకుంటున్న పాక్ ప్రధాని

  • ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ పై చర్చ
  • తేలిపోయిన పాక్ వాదన
  • ఎవరూ మద్దతుగా నిలవని వైనం
  • భారత్ వైపు సభ్యదేశాల మొగ్గు

ఓ ప్రపంచవేదికపై కశ్మీర్ అంశం చర్చకు రావడం పాకిస్థాన్ కు ఎనలేని ఆనందాన్ని ఇస్తోంది. భద్రతామండలిలో కశ్మీర్ పై చర్చ సందర్భంగా తనకు చుక్కెదురైనా, అసలు కశ్మీర్ అంశం ప్రధాన అజెండాగా ఓ కీలక సమావేశం జరగడం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను నిలవనీయడంలేదు. నిన్న జరిగిన భద్రతామండలి సమావేశంలో పాక్ కు షాకిస్తూ భారత్ కు రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండోనేషియా వంటి దేశాలు తన మద్దతు ప్రకటించాయి.

చివరికి ఐక్యరాజ్యసమితి కూడా కశ్మీర్ అంశంలో ఇతరుల జోక్యం ఉండదని, భారత్, పాకిస్థాన్ దేశాలే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఇమ్రాన్ స్వయంగా అమెరికాధీశుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. భద్రతామండలిలో పాక్ వాదనకు విలువ లేకుండా పోయింది. కనీసం ఓ చిన్న దేశం మద్దతును కూడా పాక్ సంపాదించలేకపోయింది. అయితే దీనిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా ట్విట్టర్ లో తన స్పందన వ్యక్తం చేశారు.

"ఆక్రమిత జమ్మూకశ్మీర్ లో నెలకొన్న తీవ్ర పరిస్థితులను చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశం కావడం హర్షణీయం. ప్రపంచ అత్యున్నత దౌత్యవేదికపై కశ్మీర్ అంశం చర్చకు రావడం గత 50 ఏళ్లలో ఇదే ప్రథమం. స్వతంత్ర వాదం కశ్మీరీల హక్కు అని పునరుద్ఘాటిస్తూ 11 భద్రతామండలి తీర్మానాలున్నాయి. ఇప్పుడు భద్రతామండలి సమావేశం కావడం ఆ తీర్మానాలను పునఃనిర్ధారించినట్టే. ఈ సందర్భంగా కశ్మీర్ ప్రజల వేదనను ప్రస్తావించడం, ఈ వివాదంపై తీర్మానానికి పూచీ ఇవ్వడం భద్రతామండలి బాధ్యతగా భావిస్తున్నాం" అంటూ పాక్ ప్రధాని పేర్కొన్నారు.

More Telugu News