Andhra Pradesh: చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని జగన్ కక్షసాధింపు చర్యలు చేస్తున్నారు!: బీజేపీ నేత సుజనా చౌదరి

  • టీడీపీ, వైసీపీ వరద బాధితుల్ని పట్టించుకోవట్లేదు
  • ఫ్లడ్ మేనేజ్ మెంట్ వైసీపీ ప్రభుత్వానికి చేతకావట్లేదు
  • విశాఖలో మీడియాతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు వరద బాధితులను పట్టించుకోకుండా రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వైసీపీ ప్రభుత్వానికి వరదల నియంత్రణ, సహాయక చర్యలు చేపట్టడం ఎలాగో తెలియడం లేదని చురకలు అంటించారు. జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో గిమ్మిక్కులు చేస్తోందని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న సుజనా చౌదరి ఈ మేరకు స్పందించారు.

ప్రాజెక్టుల విషయంలో ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న చర్యల కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని సుజనా చౌదరి హెచ్చరించారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన కారణంగా ఏపీకి పరిశ్రమలు రావని అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచమంతా ఆర్థికమాంద్యంపై భయపడుతున్న తరుణంలో జగన్ చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని కక్షసాధింపు చర్యలు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్డీయే విధానాలను విభేదించిన తరహాలో వైసీపీ వ్యవహరిస్తే బాగుండేది.

ఏపీ, తెలంగాణకు వరద వస్తుందని కర్ణాటక ప్రభుత్వం ముందే సమాచారం ఇచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేకపోయింది’ అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఇసుక పాలసీ నిలిపివేత, ఉపాధి హామీ పనులు ఆగిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్తంభించిందనీ, ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు.

More Telugu News