Syed Akbaruddin: పాకిస్థాన్ జర్నలిస్టు ప్రశ్నకు.. యూఎన్ లో భారత ప్రతినిధి ఎలా ప్రతిస్పందించారంటే..!

  • పోడియం నుంచి బయటకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన అక్బరుద్దీన్
  • పాక్ కు భారత్ ఇప్పటికే స్నేహ హస్తాన్ని చాచిందని వ్యాఖ్య
  • టెర్రరిజం అంతమయితేనే చర్చలంటూ స్పష్టీకరణ

కశ్మీర్ అంశంపై నిన్న ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రహస్య సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండియా అంబాసడర్, ఐక్యరాజ్యసమితిలో శాశ్వత ప్రతినిధి అయిన సయ్యద్ అక్బరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. చైనా, పాకిస్థాన్ ప్రతినిధులు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా, పాకిస్థాన్ కు చెందిన ఓ జర్నలిస్టు మాట్లాడుతూ, పాకిస్థాన్ తో చర్చలను ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. వెంటనే పోడియం నుంచి బయటకు వచ్చిన అక్బరుద్దీన్ నేరుగా సదరు జర్నలిస్టు వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అక్కడే ఉన్న మరో ఇద్దరు పాక్ జర్నలిస్టులతో కూడా కరచాలనం చేశారు. మీ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత తాను మాట్లాడతానని చెప్పారు.

 'మీకు ఒక విషయం చెబుతున్నా. సిమ్లా ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెప్పడం ద్వారా పాకిస్థాన్ కు భారత్ ఇప్పటికే స్నేహ హస్తాన్ని చాచింది. పాకిస్థాన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూద్దాం' అని చెబుతూ అక్బరుద్దీన్ తిరిగి పోడియం వద్దకు చేరుకున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు లేవని, చర్చలు జరిపేందుకు భారత్ ఎందుకు స్పందించడం లేదని పాక్ జర్నలిస్ట్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా... చర్చలు ప్రారంభం కావాలంటే ముందు టెర్రరిజం అంతం కావాలి అని చెప్పారు. కశ్మీర్ లో హింసను ప్రేరేపించేందుకు ఒక దేశంలోని నాయకులు జిహాద్ అనే పదాన్ని వాడుతున్నారంటూ పరోక్షంగా పాక్ పై విమర్శలు గుప్పించారు.

More Telugu News