India: వద్దన్నా విదేశాలకు బయలుదేరిన భార్య.. మహిళా ఉగ్రవాది వస్తోందని అధికారులకు భర్త ఫోన్!

  • ఢిల్లీ విమానాశ్రయంలో ఈ నెల 8న ఘటన
  • ఉపాధి కోసం గల్ఫ్ కు బయలుదేరిన రఫీయా
  • ఆత్మాహుతి దాడి చేసేందుకు వస్తోందని ఫోన్ చేసిన భర్త

తనను విడిచి విదేశాలకు వెళ్లిపోతున్న భార్యను ఆపేందుకు ఓ భర్త తీవ్రంగా ప్రయత్నించాడు. అయినా ఆమె మెత్తబడకపోవడంతో ఏకంగా ఎయిర్ పోర్టు అధికారులకు ఫోన్ చేసి.. ‘ఓ మహిళా ఉగ్రవాది విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి చేయబోతోంది.. జాగ్రత్త’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో సదరు భార్య ఎయిర్ పోర్టులో అడుగుపెట్టగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ నెల 8న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీలోని బవానా ప్రాంతానికి చెందిన నసీరుద్దీన్(29)  బ్యాగుల తయారీ కంపెనీని నడుపుతున్నాడు. తన కంపెనీలో పనిచేస్తున్న రఫీయాను నసీరుద్దీన్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అయితే దంపతుల మధ్య ఏమయిందో తెలియదు కానీ, తాను ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిపోతున్నానని రఫీయా చెప్పింది. దీంతో వెళ్లద్దని నసీరుద్దీన్ ఆమెను బ్రతిమాలాడు. అయినా రఫీయా వెనక్కి తగ్గలేదు. అంతలోనే నసీరుద్దీన్ బుర్రలో ఓ మెరుపులాంటి ఐడియా వచ్చింది. వెంటనే ఇంటర్నెట్ లో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నంబర్ తెలుసుకున్న నసీరుద్దీన్ వారికి ఫోన్ చేశాడు.

‘ఈరోజు దుబాయ్ లేదా సౌదీకి వెళ్లబోయే విమానంలో ఓ మహిళా ఫిదాయీ(ఆత్మహుతి దళ సభ్యురాలు) ఎక్కబోతోంది. ఆమె ఎయిర్ పోర్టులోకి రాగానే తనను తాను పేల్చేసుకుంటుంది. ఆమెను ఆపండి’ అని నసీరుద్దీన్ ఫోన్ పెట్టేశాడు. అసలే పాకిస్థాన్ తో టెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ అగంతకుడి కాల్ ను సీరియస్ గా తీసుకున్నారు. పలు విదేశీ విమాన సర్వీసులను రద్దుచేశారు. రఫీయా రాగానే ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

తాను విదేశాలకు వెళ్లకుండా ఆపడానికే తన భర్త ఇలాంటి పని చేశాడని రఫీయా చెప్పడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నసీరుద్దీన్ పై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. విచారణలో భార్య రఫీయా విదేశాలకు పోకుండా ఆపడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని నసీరుద్దీన్ అంగీకరించాడు. దీంతో అతడిని కోర్టు ముందు ప్రవేశపెట్టిన పోలీసులు, రిమాండ్ కు తరలించారు.

More Telugu News