Anant Kumar: ఎమ్మెల్యేగా మారిన గ్యాంగ్ స్టర్ ఇంటిలో పోలీసుల సోదాలు... ఏకే47 స్వాధీనం

  • బీహార్ మొకామా ఎమ్మెల్యే అనంత్ కుమార్ నివాసంపై దాడులు
  • ఏకే47ను సీజ్ చేసిన పోలీసులు
  • నివాసానికి చేరుకున్న ఎస్టీఎఫ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్

బీహార్ మొకామా నియోజకవర్గం ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ నివాసంపై దాడులు నిర్వహించిన పోలీసులకు, సోదాల్లో ఒక ఏకే47 తుపాకి, బుల్లెట్లు దొరకడంతో షాక్ కు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, గ్యాంగ్ స్టర్ అయిన అనంత్ కుమార్ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నద్వా గ్రామంలో అనంత్ కుమార్ నివాసం ఉంది. జిల్లా ఎస్పీ కంఠేశ్ మిశ్రా ఆధ్వర్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలను నిర్వహించారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే నివాసంలో కూడా సోదాలు జరిగాయి.

అయితే ఊహించని విధంగా ఏకే47 లభ్యం కావడంతో, పోలీసులు దాన్ని సీజ్ చేశారు. మరోవైపు స్పెషల్ టాస్క్ ఫోర్స్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కూడా ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకుంది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, పోలీసు జాగిలాలను కూడా రప్పిస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

More Telugu News