Andhra Pradesh: కృష్ణా జిల్లాలో బాలిక గల్లంతు.. గ్రామస్తులపై చిందులు తొక్కిన ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్!

  • వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలిక
  • గ్రామస్తులు హోంమంత్రికి ఫోన్ చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం
  • ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డ గ్రామస్తులు

ఆంధ్రప్రదేశ్ లోని నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ వరదలో అల్లాడుతున్న సామాన్యులపై చిందులు తొక్కారు. నేనుండగా హోంమంత్రికి ఎందుకు ఫోన్ చేశారంటూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాధితులు తిరగబడటంతో అక్కడి నుంచి జారుకున్నారు. కృష్ణా జిల్లాలోని చెవిటికల్లు గ్రామం వద్ద ఓ చిన్నబోటులో తండ్రి, ఇద్దరు అమ్మాయిలు బయలుదేరారు. అయితే పడవ బోల్తా కొట్టడంతో తండ్రి ఓ పాపను మాత్రమే రక్షించగలిగారు. ఇంకొక చిన్నారి కృష్ణా నది ప్రవాహంలో కొట్టుకుపోయింది.

దీంతో ఆందోళన చెందిన గ్రామస్తులు హోంమంత్రి మేకతోటి సుచరితకు ఫోన్ చేశారు. దీంతో ఘటనాస్థలికి వెళ్లాలని హోంమంత్రి ఎమ్మెల్యే జగన్మోహన్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎంత గాలించినా బాలిక మృతదేహం లభ్యం కాలేదు. ఈ సందర్భంగా బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్మోహన్ గ్రామస్తులపై తీవ్రంగా మండిపడ్డారు. ‘హోంమంత్రి ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? మీరు ఫోన్ చేస్తే హోంమంత్రి ఇక్కడకు వచ్చి పడవలు ఏర్పాటు చేస్తారా?

మీరు సీఎంకు ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా ఇక్కడ ఏర్పాట్లను సక్రమంగా పూర్తిచేశాం. మీరు ఇప్పుడు గొడవ చేయడం సరికాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు కూడా తీవ్రంగా స్పందించారు. బోట్లు, ఇతర లైఫ్ జాకెట్లు ఏర్పాట్లు చేసుంటే ఈ ప్రమాదం జరిగేదే కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే వాదిస్తూనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

More Telugu News