Rnarayanamurty: ముఖ్యమంత్రి ఎవరైనా వారిని అభిమానిస్తాం: నటుడు ఆర్‌.నారాయణమూర్తి

  • చిత్రపరిశ్రమకు రాజకీయాలతో సంబంధం లేదు
  • అది అద్దాల మేడలాంటిది
  • రిటైరయ్యాకే రాజకీయాల గురించి ఆలోచిస్తా

చిత్ర పరిశ్రమ అద్దాలమేడలాంటిదని, దాన్నుంచి చూస్తూ అర్థం చేసుకున్న వారి దృక్పథంపై దాని తీరు ఆధారపడి ఉంటుందని సీనియర్‌ నటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. జగన్‌ అధికారంలోకి రావడం పరిశ్రమకు ఇష్టం లేదన్న వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ పరిశ్రమకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా,ముఖ్యమంత్రి ఎవరైనా వారిని అభిమానిస్తామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరులో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఉత్తరాంధ్రకు గోదావరి జలాల తరలింపు వల్ల ఎంతో మేలు జరుగుతుందని, ఇందుకోసం పోరాడుతున్నామని అన్నారు. ఉత్తరాంధ్రలోని నదులతో గోదావరిని అనుసంధానిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, రిటైర్‌ అయ్యాక ఆలోచిస్తానని తెలిపారు.

గతంలో రెండు సార్లు తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు పోటీ చేయాలని కోరితే తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ రద్దును నారాయణమూర్తి సమర్థించారు. అయితే నిర్ణయం తీసుకునే ముందు అన్ని పార్టీలతో సంప్రదించి ఉంటే మరింత బాగుండేదన్నారు.

More Telugu News