Andhra Pradesh: చంద్రబాబూ.. దరఖాస్తు చేసుకో.. మా గ్రామ వాలంటీర్ ద్వారా ఇల్లు ఇప్పిస్తాం!: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

  • టీడీపీ నేతలు దిగజారి విమర్శలు చేస్తున్నారు
  • మా నాయకుడు అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాడు
  • మీడియాతో వైసీపీ నేత

కృష్ణా నదికి వస్తున్న వరదపై కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. వరద సమాచారాన్ని సంబంధిత అధికారులు వాట్సాప్ ద్వారా ప్రతీ గంటకు పంచుకుంటున్నారని వెల్లడించారు. అధికారులు అంత అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పారు. అలాంటిది మాజీ మంత్రి దేవినేని ఉమ ఈరోజు కావాలనే కృత్రిమ వరదను ప్రభుత్వం సృష్టించిందని చెప్పడం దారుణమని వ్యాఖ్యానించారు.

దీన్నిబట్టే టీడీపీ నేతలు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతుందని పేర్కొన్నారు. ‘దేవినేని ఉమ గారిని నేను ఒక్కటే అడుగుతున్నా.. అయ్యా దేవినేని ఉమ గారూ.. ఓటుకు నోటు కేసులో విచారణ ప్రారంభం కాకముందే హైదరాబాద్ నుంచి పారిపోయారు. చంద్రబాబు వారికి చిక్కకుండా, దొరకకుండా ఉండేందుకు ఇంటి కోసం మీరు పడవ వేసుకుని ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదిలో తిరిగారు. అప్పుడు ఇవన్నీ అక్రమ నిర్మాణాలేననీ, వీటిని తొలగిస్తామని మీరు చెప్పిన మాట వాస్తవం కాదా? ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి. ఐదేళ్లలో ప్రపంచస్థాయి రాజధాని కడతామని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు.

కానీ ఇప్పటివరకూ చంద్రబాబు రాజధాని ప్రాంతంలో సెంటు భూమి కొన్నారా? సొంత ఇల్లు ఉందా? మీరు అమరావతి రాజధాని అని ప్రకటించగానే అప్పటి ప్రతిపక్ష నేత జగన్  అక్కడే ఇల్లు, ఆఫీసు కట్టుకున్నారు. అంటే రాజధాని నిర్మాణంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉన్నట్లా? లేక జగన్ కు చిత్తశుద్ధి ఉన్నట్లా?. చంద్రబాబుది అక్రమ నివాసమే. ఆయన నివాసంలోని వాహనాలను హ్యాపీ రిసార్ట్స్ కు, ఫర్నీచర్ ను ఇంటిలోని మొదటి ఫ్లోర్ కు తరలించారు.

ఈ విషయమై చంద్రబాబు మీడియా ముందుకు రాకుండా ఇతరులతో మాట్లాడించడం భావ్యం కాదు. చంద్రబాబు తనకు ఇల్లు లేదనీ, వాచీ, ఉంగరం లేదని చెబుతున్నారు. మా జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఉగాది నుంచి ఇల్లు లేని వారందరికి పక్కా ఇళ్లు మంజూరు చేయబోతున్నారు. ఫో.. దరఖాస్తు పెట్టుకో. మీ దగ్గరకు కూడా మా వాలంటీర్ వస్తాడు. సెంటో, సెంటున్నరో స్థలం ఇస్తారు. లేదా మీరు లక్షల కోట్ల అవినీతి చేశారు కదా.. ఆ డబ్బులు కట్టుకున్నా ప్రభుత్వం మీ ఇంటికి భద్రతను కల్పిస్తుంది’ అని రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.

More Telugu News