Andhra Pradesh: పుష్కరాల పేరుతో 35 మందిని చంపే మేనేజ్ మెంట్ మాకు చేతకాదు!: చంద్రబాబుకు ఏపీ మంత్రి అనిల్ చురకలు

  • ఒకేసారి గేట్లు ఎత్తితే 13 లక్షల క్యూసెక్కులు వస్తాయి
  • చంద్రబాబు ఉండగా వర్షాలు రావు, గేట్లు ఎత్తరు
  • విజయవాడలో మీడియాతో ఏపీ జలవనరుల మంత్రి

కృష్ణా నదికి ఇరువైపుల ఉన్న విజువల్స్ ను సేకరించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిని ప్రత్యేకంగా ఫొటోలు తీయలేదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా విజువల్స్ సేకరించే బాధ్యతలను ఒకరికి అప్పగించామని చెప్పారు.

 విజయవాడలో ఈరోజు అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈరోజు పొద్దుటి నుంచి కొందరు మాట్లాడటం చూశా. ఒకాయన.. ఐదేళ్లు మాజీగా ఉన్న ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్నాడు. ఆయన ఉన్న ఐదేళ్లలో ఇటు వరద రాలేదు. అటు గేట్లూ ఎత్తలేదు. అతను ‘ఒకేసారి డ్యామ్ నింపి, ఒకేసారి నీళ్లు వదిలి, చంద్రబాబు ఇంటిని ముంచేయాలని ప్లాన్ వేశారు’ అంటూ మాట్లాడుతున్నారు. మాకు వరద నిర్వహణ తెలియదని చంద్రబాబు మాట్లాడుతున్నారు. వీళ్ల హయాంలో ఏనాడూ వరద రాలేదు. మన ఖర్మ.. వీళ్లు ఉండగా రాష్ట్రంలో వర్షాలు రావు. వీళ్లకు బటన్ నొక్కే పని కూడా ఉండదు.  దీన్నిబట్టి వీళ్లిద్దరికీ ఏ మాత్రం అవగాహన లేదని అర్థమవుతోంది’ అని దుయ్యబట్టారు.

దేవినేని ఉమా చెప్పినట్లు తాము నీటిని కావాలని ఆపేసి ఒకేసారి వదిలిఉంటే 12-13 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వచ్చేదని తెలిపారు. ఈ కామన్ సెన్స్ లేకుండా ఆయన మాట్లాడుతున్నారు. నీళ్లు వస్తాయని  తెలిసే చంద్రబాబు హైదరాబాద్ కు చెక్కేశారని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో 2-3 రోజుల క్రితం గేట్లు ఎత్తామన్నారు. తొలుత లక్షల క్యూసెక్కుల నీటితో ప్రారంభించి క్రమంగా పెంచుతున్నామని చెప్పారు.

లింగమనేని గెస్ట్ హౌస్ లో ఇంటివెనుక ఇసుక బస్తాలు ఎందుకు వేస్తున్నారని మంత్రి అనిల్ ప్రశ్నించారు. ‘ఇసుక బస్తాలు వేస్తున్నారంటే చంద్రబాబు ఇల్లు డేంజర్ జోన్ లో ఉన్నట్లే కదా. అంటే మేం గతంలో చెప్పింది నిజమే కదా’ అని మంత్రి అనిల్ నిలదీశారు. గోదావరి పుష్కరాల్లో 35 మందిని చంపిన తరహాలో మేనేజ్ మెంట్ తమకు చేతకాదని చంద్రబాబుకు చురకలు అంటించారు. ఈరోజు ఇంత వరద వచ్చినా ఎక్కడా ప్రాణనష్టం సంభవించలేదనీ, అధికారులు అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.

More Telugu News