Andhra Pradesh: చంద్రబాబు ఇంటిని ముంచాలి-రాజధానిని ఇడుపులపాయకు తీసుకెళ్లాలి.. జగన్ కుట్ర ఇదే!: దేవినేని ఉమ

  • కావాలనే ఈ వరదను సృష్టించారు
  • వరదను ఎమ్మెల్యే ఆర్కే పర్యవేక్షిస్తాడా?
  • విజయవాడలో మీడియాతో టీడీపీ నేత

అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అందుకే అమరావతికి వరద నీరు తీసుకురావాలని ఆయన అనుకుంటున్నారని విమర్శించారు. ఈ వరద నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వద్ద 4 రోజుల క్రితమే మానిటర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం కావాలనే ఈ వరదను సృష్టించిందని ఉమ ఆరోపించారు. విజయవాడలో ఈరోజు దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు ఇంటిలోకి నీళ్లు తీసుకురావాలన్న దుర్మార్గమైన ఆలోచనతోనే ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తలేదని ఉమ స్పష్టం చేశారు. ‘వరద పరిస్థితిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రివ్యూ చేస్తాడా? మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నాడు? మంత్రులు పోలవరం ప్రాజెక్టుకు రీటెండర్ పిలవడంపై హైదరాబాద్ లో ఫైళ్లు పట్టుకుని తిరుగుతున్నారు.

మిగిలిన ఇంజనీర్లంతా వైఎస్ రాజశేఖరరెడ్డి గారి బంధువు పీటర్ గారి దగ్గరకు వెళ్లి ఆయన దగ్గర కాగితాలు పుచ్చుకుని ప్రాజెక్టుల గురించి చెప్పుకుంటున్నారు. గోదావరికి కాఫర్ డ్యామ్ వల్ల వరద వచ్చిందని వరద ప్రభావిత ప్రాంతాలకు అన్యాయం చేశారు. మా జీవితాలతో ఆడుకుంటారా? పేదలతో, రైతుల జీవితాలతో ఆడుకుంటారా?

అయ్యా. జగన్ మోహన్ రెడ్డి.. మళ్లీ చెబుతున్నా నీకు. నువ్వు అమెరికాలో ఉన్నట్లు ఉన్నావ్. ఇక్కడ వర్షం పడలేదు. మున్నేరు, వైరా, కట్లేరు, బుడమేరు వాగుల్లో నీళ్లు రాలేదు. అయినా 2009లో 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ ఇప్పుడు 7 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చినా ఇవాళ నువ్వు జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, గద్దె రామ్మోహన్ ఏరియా అంతా ముంచేశావ్.

రాజధానిని కడప జిల్లాలోని ఇడుపులపాయకు తీసుకెళ్లాలని జగన్ కుట్ర పన్నారు. అందుకే అమరావతిలో రైతుల భూములు ముంచాలని నిర్ణయించారు. అందుకే శ్రీశైలం దగ్గర నీటిని నిలబెట్టారు’ అని విమర్శలు గుప్పించారు.

More Telugu News