Andhra Pradesh: చివరికి నా భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తారా?: డ్రోన్ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం

  • చంద్రబాబు నివాసంపై డ్రోన్ చక్కర్లు
  • డీజీపీ, ఎస్పీలకు ఫోన్ చేసిన చంద్రబాబు
  • పట్టుబడిన వ్యక్తుల పేర్లను బయటపెట్టాలని డిమాండ్

ఉండవల్లిలోని తన నివాసంపైకి కొందరు డ్రోన్లు ఎగరవేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటు గుంటూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్(ఎస్పీ)తో ఫోన్ లో మాట్లాడారు. హైసెక్యూరిటీ జోన్ లో డ్రోన్లు ఎలా ఎగరవేస్తున్నారని ప్రశ్నించారు. డ్రోన్లు ప్రయోగించింది ఎవరు? అందుకు అనుమతులు ఎవరు ఇచ్చారు? అని నిలదీశారు.

‘డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇలాంటి హై సెక్యూరిటీ ప్రదేశాల్లో డ్రోన్లు ఎగరవేయడానికి వీల్లేదు. అసలు అన్ని అనుమతులతోనే డ్రోన్లను ప్రయోగించారా? నేను ఉండే నివాసంపై డ్రోన్లతో నిఘా పెట్టిందెవరు?

చివరికి నా భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తారా? ఆ డ్రోన్లను ప్రయోగించిన వ్యక్తులు ఎవరు? ఆ డ్రోన్లలో ఏముందో, పట్టుబడిన వ్యక్తులు ఎవరో ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలి. నిఘా వేసింది ఎవరో, దీని వెనుక కుట్ర ఏముందో తెలియజేయాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

More Telugu News