independence day: గోల్కొండ కోటపై మువ్వన్నెల రెపరెపలు...జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

  • తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
  • గడచిన ఐదేళ్లలో ప్రజలకు సంతృప్తికర సేవలందించాం
  • ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు వెళ్తామని ప్రకటన

గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా ఈరోజు ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ పేరెడ్ మైదానంలోని అమర వీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన గోల్కొండ కోటకు వచ్చి జెండా ఆవిష్కరించారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపించేందుకు గడచిన ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిచ్చాయన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజలకు కనీస భద్రత కల్పించినట్లు తెలిపారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రెట్టింపు అయ్యిందన్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థతో 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించామని, గిరిజన తండాలు, ఆదివాసీ గూడెంలను పంచాయతీలుగా మార్చామని కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా,స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్‌తో పాటు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. వేడుకలను చూసేందుకు వచ్చేవారికి ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు.

More Telugu News