Andhra Pradesh: ప్రభుత్వ కొనుగోళ్లు కోటి రూపాయలు దాటితే ఆ వివరాలు వెబ్ సైట్ లో ఉంచాలి: సీఎం జగన్ ఆదేశాలు

  • ప్రభుత్వ కొనుగోళ్లలో అక్రమాలు లేకుండా చూడాలి
  • ఉత్తమ పారదర్శక విధానాలపై అధ్యయనం చేయాలి
  • కొనుగోళ్లలో పారదర్శకతపై చర్చించిన జగన్

ఏపీ ప్రభుత్వం తరపున కోటి రూపాయలు దాటి ఏం కొనుగోలు చేసినా ఆ వివరాలను వెబ్ సైట్ లో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకతపై చర్చించే నిమిత్తం సీఎం క్యాంపు కార్యాలయంలో ఈరోజు జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రభుత్వ కొనుగోళ్లలో అక్రమాలు, కుంభకోణాలకు ఆస్కారం లేకుండా చూడాలని ఆదేశించారు. ఒకోసారి మనకు తెలియకుండా చాలా అక్రమాలు జరిగిపోతాయని, వాటిని అరికట్టడానికి అధికారులు ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వం తరపున ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు టెండర్లు పిలవాలని, ఫలానా వారికి టెండర్ కేటాయింపు జరిగిన తర్వాత, ఆ రేటును వెబ్ సైట్ లో పొందుపర్చాలని సూచించారు. కొనుగోళ్లకు సంబంధించి అమలు చేస్తున్న ఉత్తమ పారదర్శక విధానాలపై అధికారులు అధ్యయనం చేయాలని సూచించిన జగన్, ఈ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 28న మరోసారి సమావేశం కానున్నట్టు తెలిపారు. 

More Telugu News