Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం మనకు గొప్ప పండగ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

  • భరతమాత బిడ్డలందరికీ సంతోషకరమైన రోజు  
  • స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుందాం
  • గాంధీ మార్గం మనకు నేటికీ ఆచరణీయం

భారత దేశ 73వ స్వాత్రంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం మనకు గొప్ప పండగ అని, భరతమాత బిడ్డలందరికీ సంతోషకరమైన రోజు అని అన్నారు. ఈ సందర్భంగా అసంఖ్యాకులైన స్వాతంత్ర్య సమరయోధులను కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకుందామని అన్నారు. దేశ స్వాతంత్ర్యం సాధించేందుకు పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని జరుపుకోబోతున్నామని చెప్పారు.

గాంధీ మార్గం మనకు నేటికీ ఆచరణీయమని, నేడు మనం అవలంబించే అనేక విధానాలు ఆయన ఆలోచనా విధానాల్లో నుంచి పుట్టినవేనని అన్నారు. నేడు ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చిన అనేక విధానాల వల్ల దేశ ప్రజల జీవనం మెరుగవుతోందని, ఈరోజున మనందరి లక్ష్యం దేశాభివృద్ధి అని, 130 కోట్ల మంది ప్రజలు తమలో ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలని అన్నారు.

‘ప్రియమైన దేశ ప్రజలారా, జమ్మూకశ్మీర్‌, లడఖ్‌ పై తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ ప్రాంత ప్రజలు అధిక ప్రయోజనాలు పొందుతారన్న విశ్వాసం నాకు ఉంది’ అని అన్నారు. జమ్మూకశ్మీర్‌, లడఖ్‌ ప్రజలు ఇక నుంచి ఇతర ప్రాంతాలతో సమానంగా హక్కులు పొందగల్గుతారని, ప్రతి భారతీయుడికి మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. సమానత్వం పెంచే ప్రగతిశీల చట్టాలను ప్రజలు అందరూ వినియోగించుకోవచ్చని, ట్రిపుల్ తలాఖ్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని, వారు నిర్భయంగా జీవించవచ్చని అన్నారు.

More Telugu News