Andhra Pradesh: ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి: ఏపీ సీఎం జగన్

  • అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇస్తాం
  • గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులను గుర్తించాలి
  • రెవెన్యూ శాఖపై సమీక్ష

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇస్తామని, ఉగాది పండగ నాటికి పట్టాల పంపిణీ జరగాలని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖపై ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారిని గుర్తించాలని అన్నారు. ప్రతి గ్రామాన్ని యూనిట్ గా తీసుకోవాలని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని, అత్యాధునిక పరికరాలు ఉపయోగించి భూముల సమగ్ర రీసర్వే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ.. ఉగాది పండగకు నెలరోజుల ముందే భూమిని అందుబాటులో ఉంచే ప్రయత్నాలు చేశామని, ఇళ్ల స్థలాల కోసం 23,448 ఎకరాలు గుర్తించామని, ఈ భూములను పరిశీలిస్తున్నట్టు జగన్ కు వివరించారు. గ్రామాల్లో దాదాపు 14.06 లక్షల మంది, పట్టణాల్లో 12.69 లక్షల మంది ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారన్న అంచనా ఉందని, ప్రస్తుతం గుర్తించిన భూమి ద్వారా తొమ్మిది లక్షల మందికి ఇళ్ల  స్థలాలు ఇవ్వగల్గుతామని అధికారులు వివరించారు. పట్టణాల్లో మరో రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు భూమి అందుబాటులో ఉందని, దాదాపు 15.75 లక్షల మందికి ఇంకా భూమిని సమకూర్చాల్సి ఉందని జగన్ కు అధికారులు వివరించారు.

More Telugu News