Uttar Pradesh: పంటలు నాశనం చేస్తున్నాయని పశువులను తెచ్చి పాఠశాల ఆవరణలో వదిలిన రైతులు

  • గేటు వేసి వెళ్లిపోవడంతో విద్యార్థుల్లో భయాందోళన
  • ఓవైపు పాఠాలు...మరోవైపు పశువుల అరుపులు
  • ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘటన

యథేచ్ఛగా వీధుల్లోకి వదిలేసిన పశువులు (ఆవులు, ఎద్దులు) తమ పంట పొలాల్లోపడి ధ్వంసం చేస్తున్నాయని భావించిన రైతులు వాటిని తెచ్చి గ్రామంలోని పాఠశాల ఆవరణలో వదిలేసి గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. ఓ వైపు విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా వినిపించిన పశువుల అరుపులతో బయటకు వచ్చి చూసిన ఉపాధ్యాయులు అవాక్కయ్యారు.

 ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సంబల్‌లోని గోన్‌హత్‌ గ్రామంలో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామం పరిధిలోని వీధుల్లో తిరుగుతున్న పశువులు తమ పంట నాశనం చేస్తుండడంతో రైతులు ఆగ్రహం చెందారు. ఎవరూ వీటిని కట్టడి చేయడం లేదన్న ఆగ్రహంతో మొత్తం 200 పశువులను వారే కట్టడి చేశారు. తెచ్చి గ్రామంలోని పాఠశాల ఆవరణలోకి తోలారు. అనంతరం గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు.

ఒక్కసారిగా వందల సంఖ్యలో పశువులు పాఠశాల ప్రాంగణంలోకి రావడంతో భయాందోళనకు గురైన విద్యార్థులు పరుగులు తీశారు. అయితే ఉపాధ్యాయులు విద్యార్థులందరినీ తరగతి గదుల్లోకి పంపించి గడియలు వేశారు. అనంతరం రైతులతో మాట్లాడగా వారు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పి సమస్యను పరిష్కరించారు. చిన్నారులకు ప్రమాదం జరిగే పరిస్థితి కల్పించిన రైతులపై కేసు నమోదు చేశారు.

More Telugu News