Bilawal Bhutto: కశ్మీర్ పై ఇమ్రాన్ ఖాన్ కు చిత్తశుద్ధి లేదు.. భారత్ పై యుద్ధం చేయండి: బిలావల్ భుట్టో

  • ప్రతి పాకిస్థానీ మీ వెంట ఉన్నారనే సందేశాన్ని కశ్మీరీలకు పంపించాలి
  • పాక్ ప్రజల్లో చీలిక తీసుకురావడానికి ఇమ్రాన్ పార్టీ యత్నిస్తోంది
  • కశ్మీరీలకు అనుకూలంగా ఉన్న మీడియాపై చర్యలు తీసుకుంటోంది

భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇద్దరూ ఒకే తరహాలో వ్యవహరిస్తున్నారని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు. నిరంకుశ భావజాలంతో కశ్మీరీలను అణచివేసేందుకు మోదీ యత్నిస్తున్నారని... పాక్ లోని విపక్షాలను ఇదే రీతిలో అణచివేసేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కశ్మీర్ అంశంలో ఇమ్రాన్ కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.

ఈద్ రోజున ఆజాద్ జమ్మూకశ్మీర్ కు ఇమ్రాన్ ఖాన్ వెళ్లలేదని... తన తరపున విదేశాంగ మంత్రి షా మెహ్మూద్ ఖురేషీని పంపించారని... కశ్మీర్ విషయంలో ఇమ్రాన్ కు ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇది చాలని బిలావల్ భుట్టో అన్నారు. ఈ కష్టకాలంలో ప్రతి పాకిస్థానీ మీ వెంటే ఉన్నారనే బలమైన సందేశాన్ని కశ్మీర్ ప్రజలకు పంపించాల్సిన అవసరం ఉందని  చెప్పారు. అవసరమైతే భారత్ తో యుద్ధానికి కూడా సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి మనకోసం పూల దండలు పట్టుకుని ఎదురు చూడటం లేదంటూ మెహ్మూద్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఎవరో వ్యతిరేకిస్తారనే భావనతో భద్రతామండలిలో అప్లికేషన్ ఫైల్ చేయకుండా... మనకు మనమే ఆగిపోవడం సరైంది కాదని బిలావల్ అన్నారు. విపక్షాలను బలహీనం చేయడం ద్వారా పాక్ ప్రజల్లో చీలిక తీసుకురావడానికి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ యత్నిస్తోందని మండిపడ్డారు. విపక్షాలకు చెందిన మహిళా నేతలను కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫర్యాల్ తల్పూర్ అనే మహిళా నేతను రాత్రికి రాత్రే అరెస్ట్ చేసి అడియాలా జైలుకు తరలించారని తెలిపారు.  

కశ్మీరీలకు అనుకూలంగా ఉన్న ఆమ్నెస్టీ, న్యూయార్క్ టైమ్స్, బీబీసీలపై ఇమ్రాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని బిలావల్ విమర్శించారు.  

More Telugu News