Pakistan: భారత్‌ను ఎదుర్కోవాలంటే జిహాద్ ఒక్కటే మార్గం: పాకిస్థాన్‌ అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు

  • బాధ్యతాయుత పదవిలో ఉంటూ నోరు పారేసుకున్న నేత
  • ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా దుమారం
  • జమ్ముకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం చేసిన భారత్‌

భారత్‌ను ఎదుర్కోవాలంటే జిహాద్ ఒక్కటే మార్గమని పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుత పదవిలో ఉంటూ ఆయన నోరు పారేసుకోవడంపై ప్రస్తుతం దుమారం చెలరేగుతోంది. ఈరోజు పాకిస్థాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణను భారత్‌ పార్లమెంటు రద్దు చేసిన విషయం తెలిసిందే. పైగా రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ చట్టం చేశారు.

ఇది జరిగినప్పటి నుంచి భారత్‌పై అక్కసుతో రగిలిపోతున్న పాకిస్థాన్‌ ఈ అంశాన్ని అంతర్జాతీయ వివాదంగా మార్చేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అగ్ర దేశాలైన అమెరికా, రష్యాయే కాదు చివరికి తన మిత్ర దేశం చైనా కూడా పాకిస్థాన్‌కు బాసటగా నిలవక పోవడంతో దాయాది దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ స్థితిలో మరింత బాధ్యతాయుతంగా ఉండి ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకోసం ప్రయత్నించాల్సిన ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ తానే స్వయంగా జిహాద్ కి పిలుపునివ్వడంపై పలువురు మండిపడుతున్నారు.

భారత్‌పై అక్కసుతో ద్వైపాక్షిక సంబంధాలను తెంచుకోవడంతో మన దేశం నుంచి దిగుమతులు నిలిచిపోయి పాకిస్థాన్‌లో వస్తువుల ధరలు ఆకాశయానం చేస్తున్నాయి. బక్రీద్‌ పవిత్ర దినాన ధరలు మండిపోవడంతో పాకిస్థాన్‌ ప్రజలు కూడా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరిఫ్‌ అల్వీ వ్యాఖ్యలు మరింత దుమారానికి కారణమయ్యాయి. కాగా, ఆరిఫ్‌ వ్యాఖ్యల నేపధ్యంలో కశ్మీర్‌లో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. దాయాది అడుగులను డేగ కళ్లతో గమనిస్తోంది.

More Telugu News