Fawad Chaudhary Hussain: మీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు: పాకిస్థాన్ మంత్రికి కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ ఘాటు సమాధానం

  • కశ్మీర్ విధులకు పంజాబీ సైనికులు దూరంగా ఉండాలన్న పాక్ మంత్రి ఫవాద్
  • మీ వ్యాఖ్యలు పాక్ నిరాశకు అద్దం పడుతున్నాయన్న సిమ్రత్ కౌర్
  • దేశం కోసం త్యాగాలు చేసే దేశభక్తులు పంజాబీలు అంటూ వ్యాఖ్య

ఇండియన్ ఆర్మీలో ఉన్న పంజాబీ సైనికులను ఉద్దేశించి పాకిస్థాన్ మంత్రి ఫవాద్ చౌదరి హుస్సేన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ మండిపడ్డారు. పాకిస్థాన్ నిరాశకు మీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని ఆమె అన్నారు.

చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను ఇండియన్ ఆర్మీలో ఉన్న సైనికులు వ్యతిరేకించాలని... కశ్మీర్ లో విధులు నిర్వహించవద్దంటూ నిన్న ఫవాద్ ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ, పంజాబీ సైనికులకు మీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. 'కశ్మీర్ లో పంజాబీ సైనికులు విధులు నిర్వహించవద్దంటూ పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు వారి నిరాశను తెలియజేస్తున్నాయి. పంజాబీలు దేశభక్తులు. దేశం విషయం వస్తే వారికి త్యాగాల కంటే ఎక్కువ మరేదీ లేదు' అన్నారు.

సిమ్రత్ కౌర్ వ్యాఖ్యలకు స్పందిస్తూ ఫవాద్ మరో ట్వీట్ చేశారు. కర్తార్ పూర్ దారిని తెరిచేటప్పుడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నానని చెప్పారు. 'మోదీ సర్కార్ వెస్ట్ ఇండియా కంపెనీ' చేతిలో కీలుబొమ్మ కావద్దని సలహా ఇచ్చారు. మహారాజా రంజిత్ సింగ్ భూమిని ఆక్రమించుకునేందుకు మోదీ చేసే ప్రయత్నాలను సఫలీకృతం కానివ్వబోమని ఆయన అన్నారు.

మరోవైపు ఫవాద్ వ్యాఖ్యలపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా స్పందించారు. భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చవద్దని పాక్ మంత్రికి సూచించారు.

More Telugu News