Pawan Kalyan: మన సాహిత్యం గురించి తెలుసుకుంటే ప్రపంచాన్ని శాసించే సినిమాలు వస్తాయి: పవన్ కల్యాణ్

  • మన సినిమాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ కల్యాణ్
  • చరిత్రలో ఎన్నో అంశాలున్నాయంటూ వెల్లడి
  • మేధావులతో మాట్లాడుతుంటే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం హైదరాబాద్ లో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ పాత్రికేయుడు తెలకపల్లి రవి రచించిన 'మన సినిమాలు, అనుభవాలు, చరిత్ర, పరిణామం' అనే పుస్తకాన్ని పవన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, మన చరిత్రలో విలువైన అంశాలు, కథలు ఎన్నో ఉన్నాయని, వాటిని వెలికితీస్తే అద్భుతమైన చిత్రాలు రూపుదిద్దుకుంటాయని అన్నారు. సాహిత్యాన్ని, చరిత్రను చదవడం ద్వారా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి చిత్రాలు వస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి పుస్తకాల ద్వారా ఎంతో మందికి ప్రేరణ కలుగుతుందని తెలిపారు.

సినిమాలు నిజజీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయో, నిజజీవితం కూడా సినిమాలను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. తాము చూసిన సంఘటనలను సినిమాల్లో పెట్టేందుకు ఎంతో కృషి చేస్తామని వివరించారు. భవిష్యత్ లో ఇలాంటి సాహితీ కమిటీలు తనకు అవకాశం ఇస్తే వారిని కూర్చోబెట్టి పల్లకీ మోస్తానని, కానీ ఆ కమిటీల్లో చేరేంత సత్తా మాత్రం తనకు లేదని వినమ్రంగా చెప్పారు. తెలకపల్లి రవి, రెంటాల జయదేవ్, తనికెళ్ల భరణి, సుద్దాల అశోక్ తేజ వంటి మేధావులతో మాట్లాడుతుంటే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని అన్నారు.

More Telugu News