జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై కేసు నమోదు

13-08-2019 Tue 10:07
  • మలికిపురంలో పేకాడుతున్న వారిని అరెస్ట్ చేసిన ఎస్సై
  • అనుచరులతో కలసి ఎస్సైతో ఘర్షణ పడ్డ రాపాక
  • రాళ్లు రువ్వడంతో పగిలిన స్టేషన్ కిటికీ అద్దాలు

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం నిన్న రాత్రి ఓ ప్రకటనను విడుదల చేశారు. పేకాడుతున్నవారికి వత్తాసు పలకడమే కాకుండా, పోలీస్ స్టేషన్ పై దౌర్జన్యం చేసి, ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారనే అభియోగాలను పోలీసులు నమోదు చేశారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే, మలికిపురంలో పేకాడుతున్న 9 మందిని స్థానిక ఎస్సై కేవీ రామారావు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో, వారిని విడిచి పెట్టాలని రాపాక వరప్రసాద్, అతని అనుచరులు ఎస్సైతో ఘర్షణ పడ్డారు. పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సుమారు 100 మంది కలసి పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వి, కిటికీ అద్దాలు పగలగొట్టారని తెలిపారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అన్నారు.

ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. రాపాక వరప్రసాద్ పై గతంలో రెండు కేసులు ఉన్నాయని చెప్పారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని... ఎంతటి వారైనా చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.