Srisailam: శ్రీశైలం, నాగార్జున సాగర్ చూసేందుకు వెళుతున్నారా? రోడ్డుపైనే పడిగాపులు తప్పవు సుమా!

  • మహోగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ
  • అందాలు చూసేందుకు సందర్శకుల పరుగులు
  • కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్
  • వెనుదిరుగుతున్న వేలాది మంది

ఓ వైపు జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలం, మరోవైపు 800 అడుగుల ఎత్తునుంచి దుమికి వచ్చే కృష్ణమ్మ అందం. శ్రీశైలం వెళ్లడానికి ఇంతకన్నా మరో కారణం ఏం కావాలి? ఇదే సమయంలో 500 అడుగుల ఎత్తునుంచి దూకే కృష్ణమ్మ అందాలు నాగార్జునసాగర్ వద్ద. జలాశయంలో లాంచీలో ప్రయాణించి, నాగార్జునకొండ సందర్శనం. అంతే... వేలాది మంది పోటెత్తగా శ్రీశైలం, నాగార్జునసాగర్ రహదారులు ట్రాఫిక్ జామ్ అయ్యాయి.

వరుస సెలవులు రావడం, ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు, టూరిస్టులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఘాట్‌ రోడ్డులో సుమారు 43 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించడం గమనార్హం. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌ నుంచి వాహనాల్లో బయలుదేరిన వారు, తమ ఐదు గంటల ప్రయాణాన్ని 14 గంటల పాటు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఫర్హాబాద్‌ నుంచే ట్రాఫిక్‌ జామ్‌ ను చూసిన ఎంతో మంది, ముందుకు వెళ్లలేమన్న భావనతో అటునుంచి అటే వెనక్కు తిరిగారు. కొందరు శ్రీశైలానికి చేరుకున్నా, స్వామి దర్శనానికి మరిన్ని గంటలు నిరీక్షించక తప్పనిసరి పరిస్థితి. పట్టణంలోని ప్రధాన వీధులు భక్తులు, వాహనాలతో కిటకిటలాడాయి. ఉచిత దర్శనానికే ఏడు గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక నాగార్జునసాగర్ సోమవారం నుంచి కిటకిటలాడుతోంది. కుడివైపు దాదాపు 8 కిలోమీటర్ల మేరకు, ఎడమవైపు ఐదు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలను నియంత్రించలేక పోలీసులు అవస్థలు పడ్డారు. నేటి ఉదయం సైతం 3 నుంచి 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డు పక్కన వాహనాలు నిలిపిన సందర్శకులు, నది అందాలను చూస్తూ అక్కడే ఉండిపోతున్నారు.

More Telugu News