Bakrid: ఆఖరికి బక్రీద్ సందర్భంగా స్వీట్లు ఇస్తామన్నా తీసుకోని పాకిస్థాన్!

  • ఆర్టికల్ 370ని రద్దు చేసిన భారత్
  • ఉడికిపోతున్న పాకిస్థాన్  
  • దుందుడుకు నిర్ణయాలతో సంబంధాలు తెంచుకుంటున్న వైనం

భారత్ తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో పాకిస్థాన్ కుతకుతలాడిపోతోంది. భారత్ ఇక ఎంతమాత్రం తన పొరుగుదేశం కాదన్న రీతిలో వ్యవహరిస్తోంది. దౌత్య, వాణిజ్య సంబంధాలతో పాటు ఇతరత్రా వ్యవహారాల్లోనూ దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటోంది. చివరికి బక్రీద్ రోజున భారత బలగాలు మర్యాదపూర్వకంగా స్వీట్లు ఇస్తామన్నా తీసుకోలేదు.

ఇరుదేశాలు తమ సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు, వేడుకలు నిర్వహించే సమయంలో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. వాఘా-అటారీ సరిహద్దు వద్ద  ఈ కార్యక్రమం ఓ ఉత్సవాన్ని తలపించే రీతిలో జరిగేది.

ఎప్పట్లానే బక్రీద్ సందర్భంగా మిఠాయిలు తీసుకువస్తున్నామంటూ బీఎస్ఎఫ్ అధికారులు పాక్ భద్రతా బలగాలకు సమాచారం అందించారు. అయితే, భారత్ నుంచి స్వీట్లు తీసుకోవాలా వద్దా అంటూ ఆ అధికారులు పాక్ ప్రభుత్వాన్ని కోరగా, "తీసుకోవద్దు, తిరస్కరించండి" అన్న సమాధానమే వచ్చింది. దాంతో భారత వర్గాలు నిరాశకు గురయ్యాయి.

More Telugu News