Chidambaram: చిదంబరం వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

  • ముస్లింలు ఎక్కువగా ఉన్నారనే ఆర్టికల్ 370ని రద్దు చేశారన్న చిదంబరం
  • చిదంబరం అసలు స్వరూపం బయటపడిందన్న గిరిరాజ్ సింగ్
  • ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శ

జమ్ముకశ్మీర్ లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారనే ఆలోచనతోనే ఆర్టికల్ 370ని రద్దు చేశారని... అదే హిందువులు ఎక్కువగా ఉంటే దాని జోలికే వెళ్లేవారు కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. చిదంబరం వంటి నేతల అసలు స్వరూపం ఏమిటో ఈ వ్యాఖ్యలతో బయటపడిందని విమర్శించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంతో బలహీనపడిపోయిందని... అందుకే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కశ్మీర్ లోయలోని ప్రజలు దశాబ్దాలుగా న్యాయం కోసం పోరాడుతున్నారని చెప్పారు.

ఆయుష్మాన్ భారత్ పథకం, ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు తదితర అంశాలను చిదంబరం, గులాం నబీ అజాద్ వంటి నేతలు వ్యతిరేకిస్తున్నారని... ఇది వారి అసలు స్వరూపాన్ని చూపిస్తోందని గిరిరాజ్ సింగ్ అన్నారు.

More Telugu News