nagarjunasagar dam: కృష్ణమ్మలో వరద ఉద్ధృతి...తెరుచుకున్న నాగార్జున సాగర్‌ 20 గేట్లు

  • ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి భారీగా వరద
  • అధికారుల ముందు జాగ్రత్త చర్యలు
  • శ్రీశైలం, సాగర్‌కు జల కళ

ఎగువ నుంచి వరద ప్రవాహం వచ్చిపడుతుండడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా  నాగార్జునసాగర్‌ జలాశయంకు చెందిన మరికొన్ని గేట్లను ఎత్తారు. మొత్తం 20 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చి పడుతున్న వరదతో జలాశయాలన్నీ జల కళను సంతరించుకున్నాయి.

 ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి భారీగా వరద రావడంతో జూరాల నిండుకుండలా మారింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టు విడిచి పెడుతుండడంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 8.63 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. దీంతో జలాశయం 10 గేట్లను 42 అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్‌ కేంద్రాలు, ఇతరత్రా మార్గాల్లో మరికొంత వరద నాగార్జునసాగర్‌కు తరలివస్తోంది.

ప్రస్తుతం సాగర్‌కు 8.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉండగా జలాశయంలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. దీంతో అధికారులు 20 గేట్లను ఐదు అడుగుల మేర పైకెత్తి మొత్తం 65,105 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 559.20 అడుగుల ఎత్తున 230.52 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు సాగర్‌ జల కళ సంతరించుకోవడం, గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తుండడంతో ఈ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.

More Telugu News