Tamilnadu: అత్తి వరదరాజ స్వామి చరిత్ర... 40 ఏళ్లు పుష్కరిణిలోనే... ఎందుకంటే..!

  • మరో ఆరు రోజులు స్వామి దర్శనం
  • ఆపై 40 ఏళ్లు పుష్కరిణిలోకి
  • అగ్నిస్వరూపంలో మహావిష్ణువు విగ్రహం
  • స్వయంగా బ్రహ్మ చెక్కించినట్టు చెబుతున్న చరిత్ర

శివ కేశవుల సంగమ క్షేత్రంగా వందల ఆలయాలుండే తమిళనాడులోని కంచిలో అత్తి వరదరాజ స్వామి ఆలయానికి ఉండే ప్రత్యేకతలు అన్నీఇన్నీ కావు. ఈ స్వామి ప్రతి 40 సంవత్సరాలకూ ఓ మారు 48 రోజుల పాటు మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం జూలై 2న స్వామి బయటకు వచ్చారు. ఆగస్టు 17 వరకూ దర్శనమిస్తారు. ఈ ఆలయ నేపథ్యం ఏంటి? స్వామి ఎందుకు 40 సంవత్సరాలకు ఓ మారు బయటకు వస్తారు? అందుకు కారణాలు ఏంటని తెలుసుకుంటే...

సాక్షాత్తూ బ్రహ్మదేవుడే ఈ శ్రీ అత్తి వరదరాజస్వామి విగ్రహాన్ని చెక్కించాడని, అందుకు దేవశిల్పి విశ్వకర్మ సహకరించాడని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు ఓ యజ్ఞాన్ని ప్రారంభించి, అందుకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చూసేందుకు విష్ణుమూర్తి విగ్రహాన్ని తయారు చేయించి, కంచిలో స్వయంగా ప్రతిష్ఠించాడు. ఈ స్వామి అగ్నిదేవుని స్వరూపం. బయట ఎక్కువకాలం ఉండలేరు. స్వామికి నిత్యాభిషేకాలు తప్పనిసరి. అయితే, 9 అడుగుల ఎత్తున ఉండే విగ్రహాన్ని మధ్యయుగంలో దాడులు జరుగుతున్న వేళ, వెండిపెట్టెలో అమర్చి, దేవాలయానికి దగ్గరలో ఉండే పుష్కరిణిలో దాచిపెట్టాలని నిర్ణయించారు. ఆపై అదే దేవుని శిల్పాన్ని ఆలయంలో ప్రతిష్టించారు.

అనంతరం స్వామికి నిత్య కైంకర్యాదులు జరగడం లేదన్న ఆలోచనతో, ప్రతి 40 సంవత్సరాలకూ ఓ మారు బయటకు తీసి, పూజలు నిర్వహించాలని ఆలయ ధర్మకర్తలైన వరదరాజ పెరుమాళ్‌ వంశం నిర్ణయించింది. మనకు తెలిసినంత వరకూ 1939, 1979 సంవత్సరాల్లో ఈ మహాక్రతువు నిర్వహించబడింది. ఈ తరానికి మాత్రం స్వామి కనిపించడం ఇదే తొలిసారి.

More Telugu News