Chandrababu: చంద్రబాబు తన ట్వీట్ తానే తొలగించుకున్నారంటే ఎన్ని అబద్ధాలు చెప్పారో అర్థమవుతుంది: పుష్పశ్రీవాణి

  • చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం
  • చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటూ మోసం చేశారని వ్యాఖ్యలు
  • 40 ఏళ్లలో చంద్రబాబు చేయలేనిది జగన్ 2 నెలల్లో చేసి చూపించారంటూ కితాబు

ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల అనుభవమని చెప్పుకుని చంద్రబాబు ప్రజలను మోసం చేశారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 600 హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. అంతేగాకుండా, గిరిజనులకు తెలివిలేదని వ్యాఖ్యానించడం ద్వారా వారిని అవమానించారని విమర్శించారు.

40 ఏళ్ల అనుభవమని చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు కంటే 40 ఏళ్ల వయసున్న సీఎం జగన్ 40 రోజుల్లో చేసి చూపించారని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. సీఎం జగన్ 2 నెలల్లోనే లక్ష 30 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని, 40 ఏళ్లలో చంద్రబాబు ఇంత పెద్ద ఎత్తున ఏనాడైనా ఉద్యోగాలు భర్తీ చేశారా? అని నిలదీశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత భారీ స్థాయిలో నియామకాలు జరపడంలేదని అన్నారు.  

చంద్రబాబు బిల్లులపై చర్చలో పాల్గొనకుండా పారిపోయారని, ఇప్పుడు ఆశావర్కర్లపై తప్పుడు ట్వీట్లు పెట్టి అభాసుపాలయ్యారని ఆమె ఆరోపించారు. తన ట్వీట్ తానే తొలగించుకున్నారంటే ఎన్ని అబద్ధాలు చెప్పారో అర్థమవుతుందని అన్నారు. లక్ష కోట్ల పెట్టుబడులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలంటూ చంద్రబాబు యువతను మోసం చేశారని, ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో ఆయనకు ఇప్పటికీ అర్థం కావడంలేదని మంత్రి ఎద్దేవా చేశారు.

ఎందుకు ఓటమిపాలయ్యారో లోకేశ్ ను ఓడించిన మంగళగిరి ప్రజలను అడిగితే తెలుస్తుందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఓటమితో చంద్రబాబు మతిభ్రమించినవాడిలా మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా బుద్ధి మారకుంటే 23 సీట్లు కాస్తా 3 సీట్లు అవుతాయని హితవు పలికారు.

More Telugu News