West Bengal: మా చేత బీఫ్, పోర్క్ డెలివరీ చేయిస్తున్నారు.. జొమాటో ఉద్యోగుల ఆందోళన!

  • పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో ఘటన
  • తమ డిమాండ్లను కంపెనీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం
  • చర్యలు తీసుకుంటామన్న రాష్ట్ర మంత్రి బెనర్జీ

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు చెందిన ఉద్యోగులు ఈరోజు పశ్చిమబెంగాల్ లో నిరవధిక ఆందోళనకు దిగారు. జొమాటో సంస్థ తమ మత విశ్వాసాలను కాదని ఆవు, ఎద్దు, గేదె మాంసం(బీఎఫ్), పంది మాంసం(పోర్క్) లను తమ చేత కస్టమర్లకు పంపిస్తోందని మండిపడ్డారు. కంపెనీ తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము గత వారం రోజులుగా హౌరా బ్రిడ్జి వద్ద ఆందోళన చేస్తున్నా జొమాటో యాజమాన్యం పట్టించుకోలేదని విమర్శించారు.

కాగా, ఈ విషయమై పశ్చిమబెంగాల్ మంత్రి రజిబ్ బెనర్జీ స్పందించారు. ‘తమ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పే అధికారం ఏ సంస్థకూ లేదు. ఇది చాలా తప్పు. జొమాటో ఉద్యోగుల ఆందోళన విషయం నా దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. ఇటీవల ఓ ముస్లిం డెలివరీ బాయ్ నుంచి ఆర్డర్ తీసుకోవడానికి ఓ ఆకతాయి నిరాకరించాడు. ముస్లిం డెలివరీ బాయ్ నుంచి తాను ఆహారం తీసుకోననీ, తనకు హిందువును పంపాలని కోరాడు. దీంతో ఆహారానికి మతానికి సంబంధం లేదనీ, ఆహారమే ఓ మతమని జొమాటో దీటుగా జవాబిచ్చింది. ఇది జరిగిన కొద్ది రోజులకే తాజా ఆందోళన రేగడం గమనార్హం.

More Telugu News