India: భవిష్యత్ లో నడుస్తూ, మాట్లాడే కంప్యూటర్లు సంస్కృతం వల్లే వస్తాయి.. దీన్ని నాసా చెప్పింది!: కేంద్ర మంత్రి రమేశ్

  • కేంద్ర మానవవనరుల మంత్రి విచిత్ర వ్యాఖ్యలు
  • చరకుడు అణు,పరమాణువుల్ని ఆవిష్కరించాడన్న రమేశ్
  • ఐఐటీ బాంబే స్నాతకోత్సవంలో పాల్గొన్న బీజేపీ నేత

కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన భారతంలో వైద్యుడైన చరకుడు ప్రపంచంలోనే తొలిసారి అణువులు, పరమాణువులను ఆవిష్కరించారని తెలిపారు. అంతేకాదు.. భవిష్యత్ లో నడిచి, మాట్లాడే కంప్యూటర్ ఏర్పడితే దానికి సంస్కృత భాషే ఆధారమవుతుందని సెలవిచ్చారు. ఎందుకంటే సంస్కృతం అత్యంత శాస్త్రీయమైన భాష అని స్వయంగా నాసా చెప్పిందన్నారు. ఐఐటీ-బాంబేలో జరిగిన స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి రమేశ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకారం భవిష్యత్ లో నడుస్తూ, మాట్లాడగలిగే కంప్యూటర్లను అభివృద్ధి చేస్తే, ఆ కంప్యూటర్ ఓ భాషను వాడాల్సి వస్తే, దానికి సంస్కృతమే ఆధారమవుతుంది. సంస్కృతం అత్యంత శాస్త్రీయమైన భాష కాబట్టే నాసా ఈ విషయాన్ని చెప్పింది. సంస్కృతంలో ఎలా మాట్లాడుతామో, అదే క్రమంలో రాస్తాం.

వేరే ఏ భాషలోనూ ఈ సౌకర్యం లేదు. కాగా, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన గ్రీకు మేధావి లుసిప్పస్ అణువులు, పరమాణువుల గురించి పరిశోధనలు  చేసి పలు సిద్ధాంతాలను ప్రతిపాదించారు. కానీ చరకుడు మాత్రం వందేళ్ల తర్వాత జన్మించినట్లు పలువురు చరిత్రకారులు చెబుతారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

More Telugu News