andhra Jyothi: ఆంధ్రజ్యోతిలో వార్త అవాస్తవం... సంజాయిషీ ఇవ్వాలన్న తెలంగాణ ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు!

  • 'ఆంధ్రజ్యోతి'లో "దొరికినా... దొరేనా?" అంటూ వార్త
  • తానేమీ లేఖను రాయలేదన్న పూర్ణచంద్రరావు
  • సంజాయిషీ ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరిక

ప్రముఖ దినపత్రిక 'ఆంధ్రజ్యోతి'లో "దొరికినా... దొరేనా?"... "సీఎం కేసీఆర్‌ కు ఏసీబీ డీజీ సంచలన లేఖ" అంటూ వచ్చిన వార్తపై తెలంగాణ ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ పూర్ణచంద్రరావు స్పందించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, తాను సీఎస్ కు, సీఎంవోకు లేఖ రాశానని వచ్చిన వార్తలు అవాస్తవమని, తనకు చాలా బాధ కలిగిందని అన్నారు.

'దొరికినా దొరేనా' అనే శీర్షికతో వార్తను ఎలా ప్రచురించారని ప్రశ్నించిన ఆయన, మీడియా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందో ఏసీబీ కూడా అలానే పని చేస్తుందని చెప్పారు. తప్పుడు వార్త విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మొత్తం వ్యవహారంపై యాజమాన్యం సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన, ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళతామని అన్నారు. వార్తలు రాసేముందు వాస్తవాలు తెలుసుకోవాలని, ఇటువంటి వార్తల వల్ల సదరు శాఖపై సదభిప్రాయం పోతుందని పూర్ణచంద్రరావు అభిప్రాయపడ్డారు.

More Telugu News