Andhra Pradesh: పెన్షన్ ఇంటికొచ్చి ఇవ్వలేదని.. పంచాయతీ కార్యదర్శిపై తల్లీకొడుకుల దాడి!

  • గుంటూరు జిల్లాలో ఘటన
  • ఇంటికొచ్చి పెన్షన్ ఇవ్వాలని వితంతువు డిమాండ్
  • అలా ఇవ్వడం కుదరదన్న కార్యదర్శి

పింఛన్ డబ్బులు ఇంటికి తెచ్చివ్వలేదన్న ఆగ్రహంతో ఓ వితంతు మహిళ పంచాయతీ కార్యదర్శిపై దాడిచేసింది. ఆమెతో పాటు వచ్చిన కుమారుడు ఆఫీసులోని కంప్యూటర్లు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బెల్లంకొండలో పంచాయతీ కార్యదర్శిగా దుర్గారావు విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ఆఫీసుకు వచ్చిన ఓ వితంతు మహిళ తన పింఛన్ ను ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలని కోరింది. అయితే అది కుదరదని, ఆఫీసుకు వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిందేనని కార్యదర్శి దుర్గారావు స్పష్టం చేశారు. దీంతో రెచ్చిపోయిన సదరు మహిళ,  తన కుమారుడితో కలిసి పంచాయతీ ఆఫీసుకు వచ్చింది. అనంతరం దుర్గారావుపై ఇద్దరూ కలిసి విచక్షణారహితంగా దాడిచేశారు.

కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. దీంతో వీరిద్దరిపై దుర్గారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సదరు మహిళ మాట్లాడుతూ.. పెన్షన్ ఇంటికి తీసుకురావాలనీ, తాను అంతదూరం నడిచి రాలేకపోతున్నానని చెప్పగా, దుర్గారావు అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. దుర్గారావు ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.  

More Telugu News